Anakapalli: పూడిమడక ఫిషింగ్ హార్బర్ పనులు వెంటనే ప్రారంభించాలి!
Anakapalli: అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ పనులు పునఃప్రారంభించాలని మత్స్యకార నాయకుల డిమాండ్. ఉప్పుటేరు పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన.
Anakapalli: పూడిమడక ఫిషింగ్ హార్బర్ పనులు వెంటనే ప్రారంభించాలి!
Anakapalli: ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ఫిషింగ్ హార్బర్ (జెట్టి) నిర్మాణ పనులను తక్షణమే పునఃప్రారంభించాలని మత్స్యకార నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి అప్పారావు బుధవారం పూడిమడకలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను పరిశీలించారు.
పూడిమడక గ్రామంలో ఫైబర్ తెప్పలు, ఫైబర్ బోట్లు కలిగిన మత్స్యకారులు సొంతంగా సమకూర్చుకున్న సుమారు రూ.10 లక్షల నిధులతో చేపడుతున్న ఉప్పుటేరు పూడికతీత పనులను నాయకులు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా చోడిపల్లి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మత్స్యకార గ్రామాల్లో ఒకటైన పూడిమడకలో మత్స్యకారుల దశాబ్దాల పోరాటం ఫలితంగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గత ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2022లో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.387 కోట్ల అంచనా వ్యయంతో జెట్టి నిర్మాణానికి టెండర్లు పిలిచి, ఏపీ మారిటైమ్ బోర్డుకు పనులు అప్పగించినట్లు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్లతో జెట్టి నిర్మాణ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించిందన్నారు. శంకుస్థాపన జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడం విచారకరమని అన్నారు.
మరోవైపు పూడిమడక మత్స్యకారుల ప్రధాన సమస్యగా మారిన ఉప్పుటేరు పూడిక సమస్యను ఆయన ప్రస్తావించారు. ఎస్‌ఈజెడ్ పరిధిలోని పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు, బురద మట్టితో ఉప్పుటేరు మార్గం పూడుకుపోయిందని తెలిపారు. దీంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మెకనైజ్డ్ ఇంజిన్ బోట్లు, ఫైబర్ తెప్పలు బురదలో కూరుకుపోతున్నాయని చెప్పారు. ఈ కారణంగా గత నాలుగు నెలలుగా అనేక మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో బోటు యజమానులు చందాలు వేసుకుని సుమారు రూ.10 లక్షల సొంత నిధులతో ఉప్పుటేరు పూడికతీత పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చోడిపల్లి అప్పారావు అన్నారు. మత్స్యకారులే సొంత డబ్బులు ఖర్చు చేసుకుని పూడికతీత పనులు చేపట్టడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఇకనైనా స్పందించి పూడిమడక ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉప్పుటేరును శాశ్వతంగా ప్రక్షాళన చేసి మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే మత్స్యకారులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ఏరిపిల్లి భాను, గనగళ్ల బాబ్జి, పొన్నమళ్ల నారాయణరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.




