Visakhapatnam: గాజువాకలో ప్రాణవాయువు కోసం పోరు.. కాలుష్యంపై సిపిఎం కదనభేరి!
Visakhapatnam: గాజువాకలో కాలుష్య రక్కసిపై సిపిఎం పోరు. కె. లోకనాథం నేతృత్వంలో కూర్మన్నపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభం.
Visakhapatnam: గాజువాకలో ప్రాణవాయువు కోసం పోరు.. కాలుష్యంపై సిపిఎం కదనభేరి!
విశాఖపట్నం: గాజువాక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించండని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు సిపిఎం స్టీల్ డివిజన్ మరియు గాజువాక డివిజన్ ఆధ్వర్యంలో కాలుష్యం కోరల నుండి గాజువాక ప్రజల ప్రాణాలు ఆరోగ్యాలను రక్షించండి అని నినాదంతో ఈరోజు నుంచి 12 వ తారీకు వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రను కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం జగ్గు నాయుడు నేడు కూర్మన్నపాలెం ఆర్చి వద్ద ప్రారంభించారు.
ఈ సందర్భంగా కె లోకనాథం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరి హక్కు కానీ నేడు కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు కాలుష్యం పరిశ్రమలతో గాజువాక ప్రజల ఆరోగ్యం గా జీవించే హక్కు ను స్థానిక ప్రజాప్రతినిధులు హరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇవి వెదజల్లే విషపూరిత వాయువుల ద్వారా గాజువాక, కూర్మన్నపాలెం, గంట్యాడ, గంగవరం, వడ్లపూడి, అగనంపూడి తదితర ప్రాంతాల లో నివసించే ప్రజలు నిరంతరం ఆస్మా, బ్రాక్రైటీస్ వంటి శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన వివరించారు. ఢిల్లీ మహానగరం కంటే నేడు గాజువాకలో వాయు, శబ్ద కాలుష్యం అధికంగా ఉన్నాయని అనేక నివేదికలు తెలియజేస్తున్న కాలుష్యం నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడానికి ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం గత వైసిపి ప్రభుత్వం ఈ కాలుష్యాన్ని అరికడతామని ప్రజలు నమ్మించి అధికారం చేపట్టి ప్రజా ఆరోగ్యాలను గాలికి వదిలి అదానీ పక్షం వహిస్తున్నాయని ఆయన అన్నారు. అదాని పోర్ట్ 31 బెర్త్ లతో 64 మిలియన్ టన్నుల నుంచి 250 మిలియన్ టన్నుల కు విస్తరిస్తే కాలుష్యం ఎంత ఎక్కువ ఉంటుందో ఊహించలేమని ఆయన స్పష్టం చేశారు. అత్యంత చవకైన సముద్ర రవాణా తో కోట్లు కొల్లగొట్టేందుకు స్టీల్ ప్లాంట్ భూముల్లో ఐరన్ ఒర్ క్రషింగ్ ప్లాంట్ స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. ఇవే జరిగితే స్థానిక ప్రజానీకం ఇక్కడ నివాస ప్రాంతం కనుమరుగవుతుందని ఆయన అన్నారు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యాలను వెదజల్లే పరిశ్రమలకు ఇక్కడ అనుమతించరాదని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ ఈ కాలుష్యానికి తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని వయసుల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పోర్టు నుంచి గాజువాక వరకు వివిధ కాలనీలలో అపార్ట్మెంట్ లలో నివసిస్తున్న ప్రజలు రణగొణ ధ్వనులతో దూసుకుపోతున్న వాహన శబ్దాలకు నిద్రలేని రాత్రులు గడపడమే కాక ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వివరించారు. అభివృద్ధి అంటే అనారోగ్యంతో బ్రతుకు జీవుడా అంటూ బ్రతకడం కాదు, ఆరోగ్యంతో జీవించడం ముఖ్యం అని ఆయన అన్నారు. గాజువాక మౌలిక వసతులు కల్పనలో నిర్లక్ష్యానికి గురి అవుతున్నదని కనుక ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన వివరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకుల నిర్లక్ష్యాన్ని నిలదీయాలి, కాలుష్యం నుంచి మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి, కాలుష్య పరిశ్రమలను తిప్పి కొట్టాలి అనే నినాదాలతో జరుగుతున్న పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.




