Visakhapatnam: విశాఖలో సీపీఐ ఆందోళన నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్!

Visakhapatnam: ఆకాశాన్నంటుతున్న ధరలకు నిరసనగా విశాఖ పూర్ణమార్కెట్ వద్ద సీపీఐ ధర్నా. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ నేతల డిమాండ్.

JAI RAM, MADURAWADA
Published on: 9 Sept 2026 4:07 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో సీపీఐ ఆందోళన నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్!

Visakhapatnam: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలపై పెనుభారంగా మారాయని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ విమర్శించారు. బుధవారం పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో విశాఖ నగరం పూర్ణమార్కెట్ దుర్గాలమ్మగుడి జంక్షన్ వద్ద నిర్వహించిన ఆందోళనలో రహిమాన్ మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయని వంటనూనె, పాలు, చక్కెర, ఉప్పు, ఉల్లి, టమాటా, బంగాళాదుంప, వంకాయ వంటి కూరగాయల ధరలు తరచూ సామాన్యుడి అందుబాటును దాటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుడి కూలి ఆశించిన స్థాయిలో పెరగడం లేదని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, చిరు వ్యాపారుల వ్యాపారాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు. మధ్యతరగతి కుటుంబాలు నెల జీతంతో నెలాఖరుకు చేరుకోవడం కష్టంగా మారిందని, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలకు మాత్రం అదుపు లేకుండా పోయిందన్నారు.

కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి ప్రోటీన్‌ ఆహార పదార్థాలు సామాన్య కుటుంబాల భోజనంలో రోజురోజుకూ తగ్గుతున్నాయని వంటనూనెల ధరల పెరుగుదల ప్రతి కుటుంబం నెలవారీ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని, పాలు, చక్కెర, ఉప్పు వంటి రోజువారీ అవసరాల ధరలు కూడా కుటుంబ ఖర్చులను పెంచుతున్నాయన్నారు.

పేదవాడి పళ్లెంలో పప్పు తగ్గుతుండగా, దళారీలు, నిల్వదారుల లాభాలు పెరుగుతున్న పరిస్థితి నెలకొందని, ఉల్లి, టమాటా, బంగాళాదుంప, వంకాయ వంటి కూరగాయల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో సామాన్యుడికి అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని, రైతు పొలంలో తక్కువ ధర, వినియోగదారుడి మార్కెట్‌లో ఎక్కువ ధర ఉండటానికి ప్రధాన కారణం మధ్యవర్తులు, దళారీలు, నిల్వదారుల దోపిడీ అని సిపిఐ పార్టీ భావిస్తోందన్నారు.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు మాట్లాడుతూ 2014 ఏప్రిల్‌లో ఢిల్లీలో పెట్రోల్‌ లీటరు ధర ₹72.26, డీజిల్‌ ₹55.49 ఉండగా, 2026 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పెట్రోల్‌ ₹102.12, డీజిల్‌ ₹95.20గా ఉన్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఖర్చులు, సరుకు రవాణా వ్యయాలను పెంచుతూ చివరకు ప్రతి నిత్యావసర వస్తువు ధరపై ప్రభావం చూపుతోందని వీటిని అదుపులోకి తేవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయాన్నారు.

ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయని, రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఈ మొత్తం భారాన్ని చివరకు మోసేది సామాన్య ప్రజలేనని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, బియ్యం, పప్పులు, నూనెలు, పాలు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించాలని, నల్లబజారు, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలని,

ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని, వంటగ్యాస్‌ ధరను తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారీలు, నిల్వదారుల దోపిడీని అరికట్టాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి.బేగం, కె.వనజాక్షి, ఆర్.శ్రీనివాసరావు, ఎన్.నాగభూషణరావు, ఎ దేముదమ్మ, బి.పుష్పలత,

ఎస్ కె.మస్తాన్ భీ, జి.రాంబాబు, ఎన్.అప్పన్న, టి వి రావు, కె తిరుపతిరావు, వి.నల్లయ్య బుజ్జి, నాయుడు, తదితరులతో పాటు పలువురు ఆటో, ముఠా కార్మికులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story