Chandrababu: కష్టాల్లో ఉన్న ఏపీకి మోదీయే ఆక్సిజన్ ఇచ్చారు
Chandrababu: "నాడే కొబ్బరికాయ కొట్టాం.. నేడే గుమ్మడికాయ కొట్టాం!" భోగాపురం ఎయిర్పోర్ట్ సభలో ప్రధాని మోదీ సాయం, ఏపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం.
Chandrababu: కష్టాల్లో ఉన్న ఏపీకి మోదీయే ఆక్సిజన్ ఇచ్చారు
Chandrababu: "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర శకంలో కొత్త చరిత్రకు నాంది పడింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే.. నేడు ప్రారంభించి గుమ్మడికాయ కొట్టింది కూడా మనమే!" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఆయన శిరస్సు వంచి పాదాభివందనం చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని, ఈ ప్రాజెక్టులో స్థానిక నాయకుల పాత్రను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర పౌరుషానికి, శక్తికి నిదర్శనం. దీనికి తొలి అడుగు వేసింది ఈ ప్రాంత వాసి అశోక్ గజపతిరాజు అయితే, నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకుంది మన రామ్మోహన్ నాయుడు. అలాగే ఈ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ గ్రూప్ అధినేత కూడా మన ఉత్తరాంధ్ర వాసే కావడం గర్వకారణం." అని సీఎం చంద్రబాబు అన్నారు.
రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశామని, అటువంటి కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ 'ఆక్సిజన్' ఇచ్చి కాపాడారని చెప్పారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మోదీయే రక్షించారని తెలిపారు. ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలోకి 189 ప్రాజెక్టుల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. అలాగే ₹2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతికి కేంద్రం సరైన సమయంలో నిధులు ఇచ్చి అండగా నిలిచిందని, 2028 నాటికి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా దేశాన్ని మోదీ సమర్థంగా నడిపిస్తున్నారని, అవినీతి మచ్చ లేని పాలన అందిస్తున్నారని చెప్పారు. ప్రతి విషయంలో 'నేషన్ ఫస్ట్' అని ఆలోచించే ఇలాంటి గొప్ప నాయకుడిని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.




