Chodavaram: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్‌ఓ ఆధ్వర్యంలో నిరసన
Chodavaram: చోడవరంలో విద్యారంగ సమస్యలపై పీడీఎస్‌ఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Chodavaram: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్‌ఓ ఆధ్వర్యంలో నిరసన
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రం లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నుండి కొత్తూరు వరకు ర్యాలీ చేసి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరిపి ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా నాయకుడు బి. రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 7000 కోట్లు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీని మూలంగా పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి ఉన్నత విద్యలు చదువుతున్న విద్యార్థులు తమ సొంత డబ్బులతోనే ఫీజులను చెల్లించి చదువుకుంటున్నారన్నారు.
చాలా చోట్ల విద్యార్థులు ఫీజులను చెల్లించలేకపోతే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పరీక్షల సమయంలో హాల్ టికెట్ లను నిలిపివేయడం జరుగుతుంది. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారంగా ఉంది కావున బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు.
అలాగే సంక్షేమ హాస్టల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా కుక్, కమాటి, వాచ్మెన్ మరియు వార్డెన్ వంటి సిబ్బందిని కొత్తగా నియమించడం లేదు. చోడవరం ఏబిసిడబ్ల్యు ఆఫీస్ పరిధిలో 15 బీసీ హాస్టల్స్ ఉంటే పది మంది మాత్రమే హాస్టల్ వార్డెన్ లు ఉన్నారనీ ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. దీంతో పాటుగా హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.3000కు కూడా పెంచాలి.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థి సంఘాలను రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. విద్యార్థులు హాస్టల్లో ఎదుర్కొనే ఫుడ్, డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, రూములు సరిపోకపోవడం,దోమల తెరులు ఇలా ఏ సమస్యలున్నా ప్రశ్నించేది, సమస్య పరిష్కారం కోసం పోరాడేది విద్యార్థి సంఘాలే. విద్యార్థుల సమస్యల కోసం పోరాడేటటువంటి విద్యార్థి సంఘాలను హాస్టల్లోకి వెళ్లకుండా ఆపడం ప్రజాస్వామ్య హక్కును హరించడమేనన్నారు.ప్రభుత్వ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలను రానివ్వకుండా ఆపుతున్న సర్క్యులర్ను రద్దు చేయాలన్నారు.
జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు ఇవ్వాలి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్యార్థుల విద్యాసంస్థల సమయాలకు అనుగుణంగా అనకాపల్లి నుండి చోడవరం, చోడవరం నుండి నర్సీపట్నం, మాడుగుల, చీడికాడ, దేవరపల్లి రూట్లలో తగినన్ని బడి బస్సులు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు డి.వరహాల నాయుడు, కె.వరుణ్ కుమార్, టీ. తరుణ్ వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు.




