Chodavaram: చోడవరం స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో మిన్నంటిన వేడుకలు!
Chodavaram: ఉత్తరాంధ్ర కాణిపాకంగా పేరుగాంచిన అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
Chodavaram: చోడవరం స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో మిన్నంటిన వేడుకలు!
Chodavaram: ఆదిపూజ్యుడు గణపతి ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆయన్నే స్మరించుకుంటాం. అలాంటి గణనాథుడికి సంబంధించిన ఒక అద్భుతమైన, మిస్టరీతో కూడిన ఆలయం మన ఉత్తరాంధ్రలోనే ఉంది. విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లి జిల్లా చోడవరంలో వెలసిన స్వయంభూ కార్యసిద్ధి విగ్నేశ్వరాలయం. దీన్ని రెండో కాణిపాకం అని, ఉత్తరాంధ్ర కాణిపాకం అని పిలుస్తారు. ఆ ఆలయ విశేషాలేంటి? అక్కడి మిస్టరీ ఏంటి? చూద్దాం.
ప్రపంచంలో ఎక్కడ చూసినా స్వయంభు శివాలయం మరియు స్వయంభు విఘ్నేశ్వరాలయం కలిగిన క్షేత్రం మనకు కనిపించదు కానీ అనకాపల్లి జిల్లా చోడవరం లో ఈ విశేషాన్ని మనం చూసి తరించవచ్చు ఇక్కడ స్వయంభు గంగా సమేత గౌరీశ్వరాలయము మరియు స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరాలయము కొలువై ఉన్నాయి.
స్థల పురాణం
సుమారు 200 ఏళ్ల క్రితం చోడవరం ప్రాంతంలో గొల్లలు గొర్రెలను కాస్తుండగా, ఒక గొయ్యిలో నుంచి వినాయకుని విగ్రహం అకస్మాత్తుగా పైకి వచ్చి దర్శనమిచ్చిందని స్థల పురాణం చెబుతోంది. అలా స్వయంభువుగా వెలసిన ఆ స్వామికి అక్కడి పెద్దలు ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ స్వామిని కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు అని పిలుస్తూ, దర్శించుకుంటే సర్వ విఘ్నాలు తొలగి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
సైన్స్ కు అందని మిస్టరీ
ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత, ఎవరూ ఛేదించలేని మిస్టరీ... ఇక్కడ స్వామి వారు నడుము పైభాగం వరకే దర్శనమిస్తారు. ఆయన తొండం భూమిలోకి చొచ్చుకుపోయినట్లు ఉంటుంది.
భక్తుల కథనం ప్రకారం, స్వామి వారి తొండం ఆలయం పక్కనే ఉన్న పెద్ద చెరువు వరకూ విస్తరించి ఉందట. ఆ తొండం ద్వారానే చెరువులోని స్వచ్ఛమైన నీరు గర్భగుడిలోకి నిరంతరం ఊటలా ఉబికి వస్తుంటుందని పూజారులు చెబుతారు. ఆ నీటినే స్వామి అభిషేకానికి, కైంకర్యాలకు వినియోగిస్తారు.
ఈ మిస్టరీని ఛేదించేందుకు గతంలో చాలా మంది తవ్వకాలు జరిపారని, అయినా ఎవరూ ఆ అంతు కనుగొనలేకపోయారని స్థానికులు చెబుతారు. ఇదంతా వినాయకుని మహత్యమే అని భక్తుల విశ్వాసం.
ఏటా పెరిగే తొండం - రెండో కాణిపాకం
మరో వింత ఏంటంటే, స్వామి వారి తొండం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుందని భక్తులు చెబుతారు. కాణిపాకంలో వినాయకుడు బావిలో వెలసి నిరంతరం నీటిలో ఉన్నట్లే, ఇక్కడ కూడా స్వామి నిరంతరం నీటిలో ఉండటం వల్ల దీన్ని రెండో కాణిపాకంగా, ఉత్తరాంధ్ర కాణిపాకంగా వ్యవహరిస్తారు.
వర్షాకాలంలో ఆలయ గర్భగుడిలోకి నీరు ఎక్కువగా వచ్చి స్వామి సగం వరకూ మునిగిపోతారు. అప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మోటార్లతో నీటిని తోడి పూజలు నిర్వహిస్తారు.
"ఇక్కడ స్వామి స్వయంభువు. గర్భగుడిలో ఊట నీరు రావడం శుభసూచకం. ఈ నీటితోనే అభిషేకం చేస్తాం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా చోడవరం గణపయ్య."
ఉత్సవాలు
ఈ ఆలయంలో ప్రతిరోజూ నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి బుధవారం ప్రత్యేక అభిషేకం, ప్రతి నెలా సంకష్టహర చతుర్థి రోజు విశేష పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి సమయంలో 9 రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.
చూశారుగా... సైన్స్ కు సైతం అంతుచిక్కని మిస్టరీ, భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచిన చోడవరం కార్యసిద్ధి వినాయకుడి మహిమ. మీరు కూడా ఒక్కసారి దర్శించుకుని, మీ కార్యాలన్నీ సిద్ధింపచేసుకోండి. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః.




