Chintapalli: గ్యాస్ డిపోను తనిఖీ చేసిన జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్
Chintapalli: చింతపల్లి జీసీసీ గ్యాస్ డౌన్‌లో అవకతవకలపై స్పందించిన జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులపై ఆగ్రహం.
Chintapalli: గ్యాస్ డిపోను తనిఖీ చేసిన జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్
చింతపల్లి: ప్రజలకు అందించే సేవల్లో అధికారులు, సిబ్బంది పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలని, నిర్లక్ష్యం లేదా అవకతవకలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని జీసీసీ గ్యాస్ డౌన్లో గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అవకతవకలపై వరుసగా వెలువడిన పత్రికా కథనాల నేపథ్యంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.
గ్యాస్ సరఫరా, పంపిణీ విధానం, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన డీజీఎం సూర్యనారాయణతో పాటు సంబంధిత అధికారులను గ్యాస్ సరఫరాలో అవకతవకలకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు.
ప్రజలకు అందాల్సిన గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పారదర్శకతకు పెద్దపీట వేయాలని చైర్మన్ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు, అవకతవకలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ప్రజా సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కిడారి శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా జీసీసీ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, మాజీ జీసీసీ చైర్మన్ ప్రసాద్, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు డీఎం విజయ్ కుమార్, మేనేజర్ సుగుణాధం, మాజీ సర్పంచులు సునీల్, బకూరు వెంకటరమణ రాజు, పాండురంగ స్వామి, టీడీపీ నాయకులు బేతాళుడు, రామకృష్ణ, భీంబాబు, మల్లేష్, మురళి, మహేష్, అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.




