Chandrababu: అభివృద్ధి అంటే పరిశ్రమలే కాదు.. స్వచ్ఛత కూడా.. అనకాపల్లి పర్యటనలో సీఎం చంద్రబాబు

Chandrababu: అనకాపల్లి జిల్లా కోడూరు పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 22 Aug 2026 2:28 PM IST
Chandrababu
X

Chandrababu: అభివృద్ధి అంటే పరిశ్రమలే కాదు.. స్వచ్ఛత కూడా.. అనకాపల్లి పర్యటనలో సీఎం చంద్రబాబు

Chandrababu: అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు మాత్రమే కాదని, స్వచ్ఛమైన వాతావరణం కలిగిన ప్రాంతాలను తీర్చిదిద్దడం కూడా అభివృద్ధేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు.

రాబోయే సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి మరియు విశాఖపట్నం ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదుగుతుందని, నాటికి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని ₹50 లక్షల వరకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామం 'జీరో వేస్ట్ పంచాయతీ'గా మారాలని, ప్రజలందరూ 'మన ఊరు-మన బాధ్యత'గా భావించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నాన్ని మించి అనకాపల్లి జిల్లా పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని సీఎం పేర్కొన్నారు. అనకాపల్లి స్టీల్ సిటీగా మారబోతోందని, డేటా సెంటర్ల రాకతో భవిష్యత్తులో ఇది 'నాలెడ్జ్ ఎకానమీ'కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు.

అయితే, మంచి పనులు చేస్తుంటే కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఇంకా ప్రారంభం కాని డేటా సెంటర్ వల్ల నీళ్లు ఇంకిపోయాయని, తాగడానికి నీరు లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రస్తుతం 'స్వచ్ఛరథాలను' గ్రామాలు, పట్టణాలకు పంపుతున్నామన్నారు. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే ఉచిత విద్యుత్ లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story