Anakapalli: ప్రజల ఆస్తుల వివరాలు ప్రైవేటుకు అప్పగించొద్దు!

Anakapalli: రిజిస్ట్రేషన్ల శాఖలో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 8 July 2026 8:49 PM IST
Anakapalli
X

Anakapalli: ప్రజల ఆస్తుల వివరాలు ప్రైవేటుకు అప్పగించొద్దు!

అనకాపల్లి జూలై 8: రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రతిపాదించిన ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల’ ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ (సీఏఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే నిర్వహించాలని ఆయన కోరారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన వెంకటరమణ, ఈ మేరకు ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీకి ‘ఎక్స్’ వేదికగా వినతిపత్రం పంపినట్లు తెలిపారు. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాలు, వీలునామాలు, వారసత్వ ఆస్తుల పంపిణీ వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజల గోప్యతకు ముప్పు కలిగించే చర్య అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత, ఆర్థిక వివరాల భద్రతపై అనేక అనుమానాలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(సి) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపే విధాన నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులో ఉన్న పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానం ద్వారా ప్రజలు స్వయంగా తమ డాక్యుమెంట్లను నమోదు చేసుకునే అవకాశం ఇప్పటికే ఉందని, అలాంటప్పుడు కొత్తగా ప్రైవేటు భాగస్వామ్యంతో సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

సేవా కేంద్రాల్లో దళారుల ప్రమేయం ఉండదనే హామీ ఎవరూ ఇవ్వలేరని, ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2 వేల వరకు అదనపు రుసుము వసూలు చేసే అవకాశం ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు. డాక్యుమెంట్ రైటర్‌ను వ్యక్తిగత సహాయకుడిగా భావించి ప్రజలు తమ వివరాలను పంచుకుంటారని, అదే ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సంస్థ ప్రతినిధులతో అలాంటి విశ్వాసం ఏర్పడదని అన్నారు.

రిజిస్ట్రేషన్ సేవలను పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలతో పోల్చడం సరికాదని పేర్కొన్న వెంకటరమణ, పాస్‌పోర్ట్ సేవల్లో వ్యక్తిగత ధృవీకరణ మాత్రమే ఉంటే, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వివరాలు, కుటుంబ, ఆర్థిక సమాచారం వంటి అత్యంత సున్నితమైన పత్రాలు ఉంటాయని చెప్పారు. ఇటువంటి సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సమంజసం కాదన్నారు.

రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇప్పటికీ సొంత భవనాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముందుగా ఉన్న కార్యాలయాలను బలోపేతం చేసి, అవసరమైన సిబ్బంది, పరికరాలు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పీపీపీ విధానంలో కాకుండా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరిన వెంకటరమణ, ప్రజల ప్రయోజనాలు, గోప్యత, విశ్వసనీయతకు భంగం కలగకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆర్టీసీ ఫిట్‌నెస్ నిర్ధారణ కేంద్రాలను థర్డ్ పార్టీకి అప్పగించడం తప్పిదమని, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ సేవలను కూడా ప్రైవేటు పరం చేసే చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story