Visakhapatnam: అధికారం బాధ్యతగా భావించండి.. బి.వి. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Visakhapatnam: అధికారం శాశ్వతం కాదని, నాయకులు వినయంతో, బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని 'తెలుగు శక్తి' అధ్యక్షుడు బి.వి. రామ్ కూటమి నేతలకు సూచించారు.
Visakhapatnam: అధికారం బాధ్యతగా భావించండి.. బి.వి. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖపట్నం: అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఏ చరిత్రను గమనించినా లేదా ప్రస్తుత సమాజాన్ని పరిశీలించినా, ఈ విషయం స్పష్టమవుతుంది శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి ప్రజా ప్రతినిధులకు మరియు కూటమి నాయకులకు సూచన చేశారు. అధికారంలో మనం చేసే పనులు, చూపే మానవత్వమే చివరకు నిలుస్తాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు సామాన్యులుగా మారవచ్చు. ప్రకృతి నియమం ప్రకారం ఏదీ శాశ్వతం కాదు, ముఖ్యంగా పదవులు మరియు హోదాలు. అందుకే అధికారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారాన్ని ఒక 'హోదా'గా కాకుండా, ప్రజలకు సేవ చేసే ఒక 'బాధ్యత'గా భావించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది.
పదవిలో ఉన్నప్పుడు చేసే మంచి పనులే ఆ వ్యక్తికి శాశ్వతమైన కీర్తిని అందిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి ముందుకు సాగితే మంచిది. అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారం తలకెక్కకుండా, వినయంతో ప్రవర్తించడం గొప్ప నాయకుడి లక్షణం. అవినీతికి తావు లేకుండా, పారదర్శకమైన పాలన అందించే వారే ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. ముఖ్యంగా నేటి యువత రాజకీయాల్లోకి లేదా పరిపాలనలోకి వచ్చినప్పుడు, అధికారం అనేది ఒక అవకాశం మాత్రమేనని, అది ప్రజల కోసం వినియోగించి, అవినీతికి తావులేని, సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా గుర్తించాలి. "పదవి అనేది నీడ వంటిది... అది వస్తుంది, పోతుంది. కానీ మనం వదిలివెళ్ళే ప్రభావం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది" అని కూటమి నాయకులను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు.




