Visakhapatnam: ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన విశాఖ రేంజ్
Visakhapatnam: మంగళగిరి, గుంటూరులో జరిగిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ క్రీడల్లో 338 పతకాలతో విశాఖ రేంజ్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.
Visakhapatnam: ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన విశాఖ రేంజ్
విశాఖపట్నం: తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో పాటు మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో 338 పతకాలు సాధించి విశాఖ రేంజ్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 15 విభాగాల్లో సుమారు 1,900 మంది పోలీసు అధికారులు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్‌కు చెందిన క్రీడాకారులు 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు సాధించారు.
విశాఖ సిటీకి అత్యధిక పతకాలు
విశాఖ రేంజ్‌లో విశాఖపట్నం సిటీ విభాగం అత్యధికంగా 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలతో మొత్తం 109 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లా 74 పతకాలు, అనకాపల్లి జిల్లా 70 పతకాలు సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
శ్రీకాకుళం 33, పార్వతీపురం మన్యం 32, అల్లూరి సీతారామరాజు జిల్లా 20 పతకాలు సాధించి విశాఖ రేంజ్ ఓవరాల్ విజయానికి కీలకంగా నిలిచాయి.
అనకాపల్లి పోలీసుల ఘన ప్రదర్శన
అనకాపల్లి జిల్లా పోలీసు క్రీడాకారులు కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 70 పతకాలు సాధించి విశాఖ రేంజ్ విజయానికి బలమైన వెన్నుదన్నుగా నిలిచారు.
విశాఖ రేంజ్ టీమ్ కెప్టెన్‌గా ఆర్.ఐ. ఎల్. మన్మధరావు జట్టును ముందుండి నడిపించడంతో పాటు ఫుట్‌బాల్, కో-కో, క్రికెట్ విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించారు.
మహిళా పోలీసుల ప్రతిభకు ప్రశంసలు
పోటీల్లో మహిళా పోలీసు సిబ్బంది అసాధారణ ప్రతిభ కనబరిచారు. డబ్ల్యూపీసీ వి. విజయ ఐదు స్వర్ణ పతకాలు సాధించగా, డబ్ల్యూపీసీ కె. విజయలక్ష్మి ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించారు.
డబ్ల్యూపీసీ ఎల్. పావని కుమారి ఏకంగా ఏడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించారు. అలాగే డబ్ల్యూపీసీ ఎం. నిర్మల, డి. రంజని, డబ్ల్యూహెచ్‌సీ డి. లలిత తదితరులు వివిధ క్రీడా విభాగాల్లో పతకాలు సాధించి సత్తా చాటారు.
పురుషుల విభాగంలోనూ మెరుపు ప్రదర్శన
హెడ్ కానిస్టేబుల్ జి. మధుబాబు స్విమ్మింగ్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించారు. పీసీ జి. శ్రీనివాసరావు బాడీబిల్డింగ్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. వాలీబాల్, హాకీ, ఫుట్‌బాల్ జట్లలోనూ పలువురు పోలీసు సిబ్బంది స్వర్ణ పతకాలు సాధించారు.
క్రీడాస్ఫూర్తే పోలీసులకు నిజమైన బలం: ఐజీ గోపినాథ్ జట్టి
ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మాట్లాడుతూ.. గెలుపు స్ఫూర్తినిస్తే, ఓటమి కొత్త అనుభవాన్ని నేర్పుతుందని అన్నారు. రెండింటినీ సమానంగా స్వీకరించడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అని పేర్కొన్నారు.
పతకాలు సాధించలేని వారు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. పోలీసుశాఖలో హోదాలు, ప్రాంతాలు వేరైనా అందరూ ఒకే కుటుంబమని, సమష్టి కృషితోనే సమాజానికి అత్యుత్తమ రక్షణ, సేవలు అందించగలమని తెలిపారు.
మారుతున్న నేరాల శైలిని ఎదుర్కోవడానికి పోలీసులకు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరమని ఐజీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బంది మైదానంలో చూపిన అంకితభావం, ప్రతిభను ఐజీ అభినందించారు. త్వరలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లోనూ సత్తా చాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విశాఖ రేంజ్‌కు మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు, పోలీసు సిబ్బందిని ఐజీ గోపినాథ్ జట్టితో పాటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి తదితర పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.




