Sabbavaram: సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మిక తనిఖీ!

Sabbavaram: అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మిక తనిఖీ.. రికార్డుల పరిశీలన, పెండింగ్ కేసులపై అధికారులకు కీలక ఆదేశాలు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 5:54 PM IST
Sabbavaram
X

Sabbavaram: సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మిక తనిఖీ!

Sabbavaram: అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, పెండింగ్ కేసుల ఫైళ్లు, కంప్యూటర్ విభాగం, లాకప్ గది, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణపై సీఐ, ఎస్సై, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు, సామాన్య ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని సత్వర న్యాయం అందించాలని ఎస్పీ సూచించారు. దర్యాప్తులో ఉన్న పెండింగ్ కేసులను నాణ్యమైన ఆధారాలతో త్వరితగతిన పూర్తి చేసి, న్యాయస్థానాల్లో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, కాలనీలు, జాతీయ రహదారులపై బీట్, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. గంజాయి, అక్రమ మద్యం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తూ నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో సబ్బవరం సీఐ జి. రామచంద్రరావు, ఎస్సై పి. సింహాచలంతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI