Anakapalli: డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్‌ను సత్కరించిన ఎస్పీ తుహిన్ సిన్హా!

Anakapalli: అనకాపల్లి ఎస్‌బీ, ఇన్‌చార్జ్ డీఎస్పీగా పనిచేసి పదవీ విరమణ పొందిన జి.ఆర్.ఆర్. మోహన్‌కు ఎస్పీ తుహిన్ సిన్హా ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికి సత్కరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 8 Sept 2026 6:52 PM IST
Anakapalli
X

Anakapalli: డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్‌ను సత్కరించిన ఎస్పీ తుహిన్ సిన్హా!

అనకాపల్లి, సెప్టెంబర్ 8: అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ డీఎస్పీగా, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీగా విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన జి.ఆర్.ఆర్. మోహన్‌కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనకాపల్లి పట్టణంలోని బొడ్డేడ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ దంపతులను జిల్లా ఎస్పీ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 35 ఏళ్ల సుదీర్ఘ పోలీసు సేవలో మోహన్ కనబరిచిన నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావాన్ని ఎస్పీ ప్రత్యేకంగా కొనియాడారు.

డీఎస్పీ మోహన్‌కు పోలీసు శాఖలో నిష్కళంకమైన సేవా రికార్డు ఉందని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో మోహన్ అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా, ఎస్‌బీ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ఆయన పదవీకాలంలో ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా విధులను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు.

ఎస్‌బీ విభాగం ద్వారా పోలీస్ స్టేషన్ల పరిస్థితులు, శాంతిభద్రతలు, రాజకీయ, సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంలో మోహన్ కీలక పాత్ర పోషించారని ఎస్పీ తెలిపారు.

పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు కూడా కె.కోటపాడులో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించడం ఆయన విధి పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమన్నారు. సర్వీసు చివరి రోజు వరకు అదే ఉత్సాహంతో పనిచేయడం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

పోలీసు అధికారులు విధి నిర్వహణతో పాటు కుటుంబం, స్నేహితులు, ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఉద్యోగ ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. పదవీ విరమణ అనంతరం మోహన్ కుటుంబంతో ఆనందంగా గడపాలని, పర్యటనలు చేస్తూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు.

1991 బ్యాచ్‌లో ఎస్‌ఐగా పోలీసు శాఖలో అడుగుపెట్టిన మోహన్, సుమారు 35 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీగా పనిచేసి శాంతిభద్రతలను పకడ్బందీగా పర్యవేక్షించారు. అనంతరం అనకాపల్లి ఎస్‌బీ డీఎస్పీగా, సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ డీఎస్పీగా సేవలందించి గత నెల 31న గౌరవప్రదంగా పదవీ విరమణ పొందారు.

వీడ్కోలు కార్యక్రమంలో డీఎస్పీ మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో పనిచేసి పదవీ విరమణ పొందడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. తన 35 ఏళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన ఉన్నతాధికారులు, సహచర అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులు, స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, డీఎస్పీలు ఈ. శ్రీనివాసులు, పి. శ్రీనివాసరావు, బి. మోహనరావు, మురళీకృష్ణ, కె. రవికుమార్, ఎస్‌బీ సీఐలు ఎస్. బాల సూర్యారావు, టీ. లక్ష్మితో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, మోహన్ కుటుంబసభ్యులు, ఆత్మీయులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story