Anakapalli: మామిడిపాలెంలో పోలీసుల పల్లెనిద్ర: పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా
Anakapalli: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మామిడిపాలెంలో అనకాపల్లి రూరల్ పోలీసులు పల్లెనిద్ర నిర్వహించి, శాంతిభద్రతలు, సైబర్ క్రైమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.
Anakapalli: మామిడిపాలెంలో పోలీసుల పల్లెనిద్ర: పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా
అనకాపల్లి: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఈ. శ్రీనివాసులు సూచనలతో గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా అనకాపల్లి మండలంలోని సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన మామిడిపాలెంలో అనకాపల్లి రూరల్ పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని సామాజిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామ యువత, ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
సాధారణ సమయాల్లో జరిగే గొడవలతో పోలిస్తే ఎన్నికల సమయంలో జరిగే ఘర్షణలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు అవసరమైన సందర్భాల్లో రౌడీ షీట్లు తెరవడం, సత్ప్రవర్తనతో ఉండేలా బైండ్ ఓవర్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పలు అంశాలపై అవగాహన
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పలు సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
బాల్య వివాహాలు: బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు.
మహిళా భద్రత: మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న అభయ యాప్, శక్తి టీమ్స్, డయల్ 100, 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
సైబర్ నేరాలు: సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
చెడు వ్యసనాలు: యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సీఐ శ్రీ జి. అశోక్ కుమార్, అదనపు ఎస్‌ఐ శ్రీ కళ్యాణ్ రాజు, హెడ్ కానిస్టేబుల్ కేటీఎన్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ ఆర్.కె. నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




