Anakapalli: బోరున వర్షంలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ!

Anakapalli: అనకాపల్లిలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ శాలరీ డిమాండ్. స్పందించకుంటే సమ్మెకు హెచ్చరిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 13 Sept 2026 11:40 AM IST
Anakapalli
X

Anakapalli: బోరున వర్షంలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ!

Anakapalli: వైద్య, ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ జరిగే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉద్యోగులు వెనుకడుగు వేయకుండా ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. అనంతరం తిరిగి ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

వైద్య, ఆరోగ్య శాఖలో ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్‌పర్సన్ జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వి.వి. శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు వై.ఎన్. భద్రం, రైతుకూలీ సంఘం నాయకులు మోహన్, అల్లూరి జిల్లా జేఏసీ నాయకులు దినేష్ తదితరులు మాట్లాడారు.

తమ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మెకు సైతం సిద్ధమవుతామని నాయకులు హెచ్చరించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా జేఏసీ నాయకులు గుణ, గోవింద్, జేఏసీ చైర్మన్, కన్వీనర్ రాజబాబు, జయరత్నం, మోహన్, జగదీశ్వరి, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI