Anakapalli: ఏటికొప్పాకలో రూ.3 కోట్లతో హస్తకళా థీమ్ పార్క్‌కు శంకుస్థాపన

Anakapalli: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హస్తకళా ఇతివృత్త ఉద్యానవనానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Aug 2026 8:24 PM IST
Anakapalli
X

Anakapalli: ఏటికొప్పాకలో రూ.3 కోట్లతో హస్తకళా థీమ్ పార్క్‌కు శంకుస్థాపన

అనకాపల్లి: ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్క బొమ్మల కళకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా కీలక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఏటికొప్పాక హస్తకళా ఇతివృత్త ఉద్యానవనానికి శుక్రవారం ఘనంగా భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏటికొప్పాక హస్తకళాకారుల తయారీ కేంద్రాలను సందర్శించి వారి పనితీరును పరిశీలించారు. కళాకారులు రూపొందిస్తున్న లక్క బొమ్మలు, వాటి తయారీ విధానం, సహజ రంగుల వినియోగం, సంప్రదాయ హస్తకళా పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు.

ఏటికొప్పాక హస్తకళలకు ప్రపంచస్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ తెలిపారు. ఈ ప్రాంత హస్తకళా సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఏటికొప్పాక లక్క బొమ్మలకు పద్మశ్రీతో పాటు జాతీయ స్థాయి అవార్డులు రావడం గ్రామానికి, హస్తకళాకారులకు గర్వకారణమన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించడం ఏటికొప్పాక కళాకారుల ప్రత్యేకతగా పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ.. ఏటికొప్పాక హస్తకళా ఇతివృత్త ఉద్యానవనం నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఏటికొప్పాక గ్రామానికి, హస్తకళాకారులకు ఈ ప్రాజెక్టు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చే గొప్ప అవకాశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుమారు 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి హస్తకళా ఇతివృత్త ఉద్యానవనానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

భవిష్యత్తులో హస్తకళాకారుల సంక్షేమం, ఆరోగ్యం, జీవనోపాధి, ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏటికొప్పాక హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరింత మార్కెట్ కల్పించి.. ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రాచుర్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఏటికొప్పాక హస్తకళా హబ్, థీమ్ పార్క్ అభివృద్ధితో పాటు సమీప ప్రాంతంలో రిసార్ట్ ఏర్పాటు, లెఫ్ట్ కెనాల్‌కు అనుమతులు తీసుకుని బోటు షికారు వంటి పర్యాటక సదుపాయాలను అభివృద్ధి చేసే అంశంపై సంబంధిత శాఖలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటికొప్పాక లక్క బొమ్మలకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకువచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏటికొప్పాకను భవిష్యత్తులో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, ప్రముఖ హస్తకళా హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

హస్తకళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు.. వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువత, హస్తకళాకారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story