Anakapalli: అనకాపల్లి ఆవకండం పరిరక్షణ కోసం నిరాహార దీక్ష

Anakapalli: అనకాపల్లి ఆవకండం పరిరక్షణ కోసం కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 25 Jun 2026 1:02 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి ఆవకండం పరిరక్షణ కోసం నిరాహార దీక్ష

అనకాపల్లి: అనకాపల్లి ఆవకండం పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆవకండం పరిరక్షణ సమితి కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆవకండంలో జరుగుతున్న అక్రమ ఫిల్లింగ్, నిర్మాణాలను నిరసిస్తూ ఈ దీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఆవకండం పరిరక్షణ వేదిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. అనకాపల్లి గవరపాలెం వార్డు సౌత్-2 పరిధిలో బైపాస్ రోడ్డుకు అవతల ఉన్న ఆవకండం ప్రాంతాన్ని వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో వాటర్ బాడీగా, అగ్రికల్చరల్ యూజ్ జోన్‌గా గుర్తించినప్పటికీ అక్కడ అక్రమంగా మట్టి నింపడం, నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని ఆరోపించారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం విచారకరమని వేదిక ప్రతినిధులు విమర్శించారు. ఈ వైఖరికి నిరసనగానే నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు.

అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్డీఏ కమిషనర్‌లు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వేదిక ప్రధాన డిమాండ్లు

ఆవకండంలో కొనసాగుతున్న అక్రమ ఫిల్లింగ్‌ను వెంటనే నిలిపివేయాలి.

వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా మంజూరు చేసిన భూ మార్పిడి అనుమతులు, ప్లాన్లను రద్దు చేయాలి.

అక్రమ ఫిల్లింగ్, నిర్మాణాలను తొలగించాలి.

ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

అనకాపల్లి పట్టణాన్ని భవిష్యత్తులో జలముంపు ప్రమాదాల నుంచి రక్షించాలి.

ఈ నిరాహార దీక్షకు సీపీఐ సీనియర్ నాయకుడు వై.ఎన్. భద్రం, సీపీఐ జోనల్ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, మత్తురగతి సూరిబాబు, అనకాపల్లి యాదవ సంఘం నాయకుడు పల్లా సత్యప్పారావు తదితరులు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా వై.ఎన్. భద్రం మాట్లాడుతూ, ఆవకండం ఎత్తు పెంచడం వల్ల భవిష్యత్తులో అనకాపల్లి పట్టణం జలమయం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని ఈ చర్యలను నిలిపివేయాలని కోరారు.

అదేవిధంగా గతంలో 13 లింకుల వెడల్పుతో ఉన్న పంటకాలువలను ఆక్రమణల కారణంగా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు అడుగులకే పరిమితం చేశారని ఆరోపించారు. కాలువలను కుదించివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆవకండంలో జరుగుతున్న అక్రమాల వల్ల ఎగువ, దిగువ ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story