Anakapalle: రైలు కింద పడిన వ్యక్తిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్!
Anakapalle: రైలు కింద చిక్కుకున్న ప్రయాణికుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు. ధైర్యసాహసాలను అభినందించి రివార్డు అందజేసిన అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా.
Anakapalle: రైలు కింద పడిన వ్యక్తిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్!
Anakapalle: విపత్కర పరిస్థితుల్లో ఏమాత్రం వెనుకాడకుండా రైలు కింద చిక్కుకున్న ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ఎం. చంద్రరావుపై ప్రశంసల జల్లు కురిసింది. ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. చంద్రరావు చూపిన ధైర్యసాహసాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
తుని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ ప్రయాణికుడు పట్టాల మధ్య చిక్కుకుపోయాడు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాధితుడిని గమనించిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రైలు కిందకు వెళ్లి బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు.
ఈ సాహసోపేత చర్యను గుర్తించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రరావును స్వయంగా అభినందించారు. ఆయన చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, మానవత్వానికి గుర్తింపుగా ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించి అమూల్యమైన మానవ ప్రాణాన్ని కాపాడటం అత్యంత అభినందనీయమన్నారు. ప్రమాద సమయంలో కొందరు కేవలం వీడియోలు తీయడానికే పరిమితమవుతున్న పరిస్థితుల్లో.. చంద్రరావు ఏమాత్రం సంకోచించకుండా బాధితుడిని కాపాడేందుకు ముందుకు రావడం ఆయన అంకితభావానికి, మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు.
“యూనిఫాంలో ఉన్నా.. లేకున్నా.. డ్యూటీలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా.. ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీసుల ప్రథమ కర్తవ్యం” అని ఎస్పీ స్పష్టం చేశారు. చంద్రరావు చూపిన తెగువ జిల్లా పోలీసు శాఖకే గర్వకారణమన్నారు. ఇలాంటి నిస్వార్థ సేవలు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో గౌరవం, నమ్మకాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సేవాభావాన్ని, కర్తవ్యనిష్ఠను పోలీసు సిబ్బంది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఎం. ఉపేంద్రతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.




