Anakapalli: అనకాపల్లి విజయరామరాజుపేటలో త్రీ-ఫేజ్ విద్యుత్ ప్రారంభం!

Anakapalli: అనకాపల్లి విజయరామరాజుపేటలో 40 ఏళ్ల లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరాను ప్రారంభించిన అధికారులు, నేతలు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 6:03 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి విజయరామరాజుపేటలో త్రీ-ఫేజ్ విద్యుత్ ప్రారంభం!

Anakapalli: పట్టణంలోని విజయరామరాజుపేట, శ్రీ బాల గణపతి దేవాలయం పరిసర ప్రాంతాల ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న సింగిల్‌ఫేజ్ విద్యుత్ సరఫరాకు స్వస్తి పలుకుతూ.. స్థానికులకు త్రీ-ఫేజ్ విద్యుత్ లైన్ అందుబాటులోకి వచ్చింది.

సుమారు 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో 20 నుంచి 25 ఇళ్లు మాత్రమే ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన సింగిల్‌ఫేజ్ విద్యుత్ లైన్‌నే ఇప్పటివరకు వినియోగిస్తూ వచ్చారు. కాలక్రమేణా ఇళ్ల సంఖ్య 60కి పైగా పెరగడంతో విద్యుత్ లోడ్ భారీగా పెరిగింది. దీంతో తరచూ లో-వోల్టేజ్, పవర్ ఫ్లక్చుయేషన్స్‌తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా వేసవి కాలంలో ఏసీలు పనిచేయకపోవడం, ఫ్యాన్లు సక్రమంగా తిరగకపోవడం, విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా ఫ్రిజ్‌లు, టీవీలు వంటి విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. రాత్రివేళల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు.

ఈ సమస్యను జీవీఎంసీ 82వ వార్డు జనసేన పార్టీ కన్వీనర్ ఆళ్ల ఇందు రామచంద్రరావు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రాంకీ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాలు, సహకారంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా పాత, శిథిలమైన విద్యుత్ స్తంభాలు, వైర్లను తొలగించి.. నూతన కాంక్రీట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అధిక విద్యుత్ లోడ్‌ను తట్టుకునే సామర్థ్యంతో త్రీ-ఫేజ్ విద్యుత్ లైన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

40 ఏళ్లుగా తమను వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు, ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రాంకీకి, పనులను దగ్గరుండి పర్యవేక్షించిన 82వ వార్డు జనసేన పార్టీ కన్వీనర్ ఆళ్ల ఇందు రామచంద్రరావుకు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారానికి సహకరించిన విద్యుత్ శాఖ అధికారులకు కూడా బాల గణపతి ఆలయ పరిసర ప్రాంతాల నివాసితులు ధన్యవాదాలు తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI