Vijayawada: పోరంకి వేద పాఠశాలను సందర్శించిన సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న!
Vijayawada: పోరంకిలోని దుర్గా మల్లేశ్వర వేద పాఠశాలను సందర్శించిన సీఎం కార్యదర్శి పి.ఎస్. ప్రద్యుమ్న. విద్యార్థులకు వేద ఆశీర్వచనం, పండ్ల పంపిణీ.
Vijayawada: పోరంకి వేద పాఠశాలను సందర్శించిన సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న!
Vijayawada: ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న ‘శ్రీ దుర్గా మల్లేశ్వర వేద పాఠశాల’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్. ప్రద్యుమ్న సోమవారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.
వేద పాఠశాలకు విచ్చేసిన సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న దంపతులకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, వేద పండితులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.
పి.ఎస్. ప్రద్యుమ్న వేద పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యార్థులతో స్వయంగా ముచ్చటించారు. వేద అభ్యాసన క్రమం, విద్యా విధానం, వారి భవిష్యత్ లక్ష్యాలు మరియు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణలో వేదాల ప్రాధాన్యత, నేటి సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణలో వేదాలకు ఉన్న ప్రాధాన్యతను, వేదం అభ్యసించిన పండితులకు సమాజంలో లభిస్తున్న విశిష్ట గౌరవాన్ని ఈ సందర్భంగా వివరించారు.
దేవస్థానాలు కల్పిస్తున్న ఇటువంటి ప్రోత్సాహకర వాతావరణం మరింత విస్తృతమై, భావితరాల్లో ఎక్కువ మంది వేద విద్యను అభ్యసించేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులు నిర్వహించిన సామూహిక వేద ఘోష, వేద పఠన కార్యక్రమాన్ని సీఎం కార్యదర్శి దంపతులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకించి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా పండ్లను పంపిణీ చేశారు.
కార్యక్రమ ముగింపులో వేద పాఠశాల ప్రధాన అధ్యాపకులు, వేద పండితులు సీఎం కార్యదర్శి పి.ఎస్. ప్రద్యుమ్న దంపతులకు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ వారికి శ్రీ దుర్గమ్మ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, వేద పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




