Vijayawada: విశాఖ లారీ డ్రైవర్ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

Vijayawada: విశాఖపట్నంలో లారీ డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటనపై అసంపూర్ణ వీడియోలతో AMVIని బాధ్యులుగా చేయొద్దని, సమగ్ర విచారణ జరపాలని రవాణాశాఖ అధికారుల సంఘం కోరింది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Aug 2026 6:34 PM IST
Vijayawada
X

Vijayawada: విశాఖ లారీ డ్రైవర్ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

విజయవాడ: విశాఖపట్నంలో లారీ డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (AMVI)ను బాధ్యులుగా నిర్ధారించడం సరికాదని, ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఆర్. ప్రవీణ్, ఎండిఎల్ సిద్ధిక్ కోరారు.

విజయవాడ బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయ ప్రాంగణంలోని అసోసియేషన్ భవనంలో శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆర్. ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అయన అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రాకముందే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎడిట్ చేసిన లేదా పరిమిత దృశ్యాల ఆధారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని దోషిగా చిత్రీకరించడం సముచితం కాదన్నారు.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వీడియోను పరిశీలించినప్పుడు, లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాల్లో AMVI ప్రత్యక్షంగా దాడి చేస్తున్నట్లు ఎక్కడ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఉన్న కార్ డ్రైవర్‌ పాత్రకు సంబంధించిన దృశ్యాలు మాత్రమే కనిపిస్తున్న నేపథ్యంలో, పూర్తి ఘటనను పరిశీలించకుండా AMVIని దాడికి బాధ్యులుగా పేర్కొనడం సరైన విధానం కాదని అయన అన్నారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీ, అందుబాటులో ఉన్న CCTV దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఘటనకు ముందు మరియు తరువాత జరిగిన పరిణామాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.

రవాణాశాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా అనేక సందర్భాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా వ్యవహరించాల్సి వస్తుందని, అలాంటి సందర్భాల్లో ఏదైనా వివాదం తలెత్తితే చట్టపరమైన విధానంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు.

ఎవరైనా తప్పు చేసినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడాన్ని తమ సంఘం ఎప్పుడూ వ్యతిరేకించదని, కేవలం అపోహలు లేదా అసంపూర్ణ వీడియో ఆధారంగా బాధ్యులుగా నిలబెట్టడం మాత్రం సమర్థనీయం కాదని ఆర్. ప్రవీణ్ స్పష్టం చేశారు.

కాబట్టి విశాఖ ఘటనపై నిష్పాక్షిక, సమగ్ర విచారణ జరిపి అసలు ఘటన ఏమిటో, ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో నిర్ధారించి, వాస్తవాల ఆధారంగా మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ప్రవీణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండిఎల్ సిద్దిక్ విజ్ఞప్తి చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story