Vijayawada: ఏపీలో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!

Vijayawada: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా మెంటార్ పాత్ర పోషిస్తానని తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 7 Sept 2026 2:18 PM IST
Vijayawada
X

Vijayawada: ఏపీలో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేవబోతోందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని, తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా టీడీపీ, వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని పోరాడే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు.

టీడీపీ, వైసీపీపై ఘాటు విమర్శలు

టీడీపీ, వైసీపీలు ఆంధ్రప్రదేశ్‌కు చేసిందేమీ లేదని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

“నేను సీఎం అభ్యర్థిని కాదు”

కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాను మాత్రం ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని స్పష్టం చేయడం రాజకీయంగా మరింత ఆసక్తిని రేకెత్తించింది.

“నేను స్థాపించబోయే పార్టీకి నేను సీఎం అభ్యర్థిని కాదు. నా పాత్ర బాల్‌థాకరే తరహాలో మెంటార్‌గా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

దీంతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వెనుక వ్యూహం ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రత్యక్ష అధికార లక్ష్యంతో కాకుండా.. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించి, దానికి మార్గనిర్దేశం చేసే పాత్రలో ఆయన ఉండబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది?

ఇప్పటికే టీడీపీ–వైసీపీ ఆధిపత్య రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని నిర్మించే ప్రయత్నం జరుగుతుందన్న చర్చకు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.

“టీడీపీ–వైసీపీ మధ్య నలిగిపోతున్న ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలి” అనే నినాదంతో కొత్త రాజకీయ శక్తిని నిర్మించాలన్న ఆయన ఆలోచన కార్యరూపం దాల్చితే.. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచే అవకాశం ఉంది.

అయితే కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, నాయకత్వ నిర్మాణం, ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారన్న అంశాలపై విజయసాయిరెడ్డి మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మొత్తంగా.. విజయసాయిరెడ్డి ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెరతీసింది. రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదిక వస్తుందన్న సంకేతాలు వెలువడటంతో.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story