Vijayawada: డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి: ఎంపీ కేశినేని చిన్ని

Vijayawada: డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, స్పోర్ట్స్ కోటాపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 11 Sept 2026 3:24 PM IST
Vijayawada
X

Vijayawada: డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ: (ఎంపీ కార్యాలయo) డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సాక్షి పత్రికలో ప్రచురిస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని, డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు కూడా నియామకాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.స్పోర్ట్స్ కోటా నిబంధనలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు అధికారులు ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చారని ఎంపీ తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారం నేరుగా కేటాయింపులు జరుగుతాయని, అభ్యర్థుల ఎంపికలో మెరిట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు ఉంటాయని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు.

డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించి సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, వారు ఇప్పటికే విధుల్లో ఉన్నారని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం వారి రాజకీయ ఉద్దేశాలను స్పష్టం చేస్తోందన్నారు.రామకృష్ణ విషయంలో వైసీపీ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించారని, ఆయన ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న విషయం ఇందుకు సజీవ సాక్ష్యమని ఎంపీ తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు..

ఏపీపీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై విచారణ కొనసాగుతోందని, గ్రూప్-1 అంశంపై కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతోందని ఎంపీ చిన్ని తెలిపారు. త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే వైసీపీ నేతలు డీఎస్సీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బహిరంగ చర్చకు సిద్ధమని ఇప్పటికే సవాల్ చేశారని, దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్‌ను స్వీకరించి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఎంపీ చిన్ని అన్నారు.ప్రజలకు ఉద్యోగాలు, కుటుంబాల్లో ఆనందం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మబోరని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.

అనంతరం వేముల రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల రాధిక అనే మహిళ తన పేరును ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వేముల రామకృష్ణ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షలో తనకు 104 మార్కులు మాత్రమే వచ్చాయని, తనకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాలేదని తెలిపారు.తాను రూ.15 లక్షలు చెల్లించి డీఎస్సీ ఉద్యోగం కొనుగోలు చేశానంటూ తనపై ఆరోపణలు చేయడం తీవ్రంగా బాధించిందని అన్నారు.

నిజంగా తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉంటే, తాను ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నానో ఆధారాలతో చూపించాలని సవాల్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసం తనను దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, తన గురించి ఎవరైనా పూర్తిస్థాయిలో విచారణ చేసుకోవచ్చని వేముల రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుతం కూడా తాను ఉదయం నుంచి రాత్రి వరకు ప్రైవేటు విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.