Vijayawada: ఆలయాల భద్రతలో కూటమి సర్కార్ విఫలం: మల్లాది విష్ణు!

Vijayawada: ముక్త్యాల చెన్నకేశవ స్వామి ఆలయంలో దొంగతనం జరగడంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 8 Sept 2026 8:32 PM IST
Vijayawada
X

Vijayawada: ఆలయాల భద్రతలో కూటమి సర్కార్ విఫలం: మల్లాది విష్ణు!

విజయవాడ: రాష్ట్రంలో దేవాలయాలకు, దేవుడి ఆస్తులకు, అమ్మవార్ల మంగళసూత్రాలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగ్గయ్యపేట నియోజకవర్గం ముక్త్యాల శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో చోరీ జరగడం తీవ్ర దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో స్వామివారికి చెందిన 6 కేజీల వెండి, 6 గ్రాముల బంగారం, అమ్మవారి మంగళసూత్రాలను దొంగలు దోచుకెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ దేవాలయాల వద్ద భద్రత పూర్తిగా దిగజారిపోతోందని, కనీసం సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసే బాధ్యత కూడా ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు.

ఇటీవలే శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం, కాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో మంగళసూత్రాల చోరీ జరిగినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ముక్త్యాలలో మళ్లీ దొంగతనం జరిగిందని విమర్శించారు. సాక్షాత్తూ దేవుడి సొత్తుకే రక్షణ లేకపోతే, సమాజంలో సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. దొంగల భయంతో బెంబేలెత్తుతున్న భక్తులు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, భక్తుల విశ్వాసాలకు నిలయమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో వరస దొంగతనాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఆలయాల్లోని వెండి, బంగారు అభరణాలు, హుండీల్లోని సొమ్ము మాయమవుతుంటే దొంగల భయంతో ప్రజలు, అర్చకులు బెంబేలెత్తిపోతున్నారు అని మల్లాది విష్ణు అన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో దేవాలయాల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. మా పాలనలో ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేశాం. కానీ, నేడు కూటమి ప్రభుత్వంలో అలయాల రక్షణను గాలికి వదిలేశారన్నారు. రాజకీయ కక్షసాధింపులపై పెట్టిన దృష్టిని ఆలయాల భద్రతపై పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది అని దుయ్యబట్టారు.

వెంటనే ప్రభుత్వం మేల్కొని, ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మూలకాలను కఠినంగా శిక్షించాలని, భక్తుల మనోభావాలను కాపాడాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. అలయాల వద్ద భద్రతను పునరుద్ధరించకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హిందూ దేవాలయాల పరిరక్షణలో వైఎస్ జగన్ ప్రభుత్వం నభూతో నభవిష్యత్.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 వేలకు పైగా చిన్న, పెద్ద ఆలయాలను జియో-ట్యాగింగ్ చేసి పోలీస్ నిఘా వ్యవస్థకు అనుసంధానించామని, 50 వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో సైతం పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రథాలు, విలువైన ఆభరణాలు, హుండీల రక్షణకు ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్ అమలు చేశామన్నారు. టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లో ఏకంగా 3,000కు పైగా కొత్త హిందూ దేవాలయాలను నిర్మించి ధర్మ ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్లారన్నారు.

గతంలో కేవలం 1,561 ఆలయాలకే పరిమితమైన ధూప దీప నైవేద్యం పథకాన్ని 5,000కు పైగా ఆలయాలకు విస్తరించి అర్చకులకు నెలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని వేలాది ఎకరాల ఆలయ భూములను సమగ్ర సర్వే చేసి, డిజిటైజ్ చేయడం ద్వారా ఆక్రమణల నుంచి రక్షించారన్నారు. సీజీఎఫ్ నిధుల ద్వారా శిథిలావస్థలో ఉన్న వందలాది పురాతన ఆలయాలు, రథాల పునర్నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేశామన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story