Indrakeeladri: వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు 600 మందికి ఉచిత దర్శనం

Indrakeeladri: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి.

Satyanarayana, Vijayawada
Published on: 4 Sept 2026 5:54 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు 600 మందికి ఉచిత దర్శనం

ఇంద్రకీలాద్రి: పవిత్ర శ్రావణ మాసం చివరి (4వ) శుక్రవారాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున మహా మండపంలో నిర్వహించిన ‘సామూహిక వరలక్ష్మీ వ్రతాలు’ అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.

​ఆలయ వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు మొదటి విడతగా ‘ఆర్జిత సేవ’ రూపంలో, అనంతరం ఉదయం 10:00 గంటల నుండి 11:30 గంటల వరకు రెండవ విడతగా ‘ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం’ శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.

​ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా నిరుపేద మహిళలు కూడా అమ్మవారి సన్నిధిలో వ్రతం ఆచరించేలా దేవస్థానం చేపట్టిన చొరవతో 600 మందికి పైగా మహిళలు ఉచిత సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే ఉచితంగా సమకూర్చింది. వ్రతం ముగిసిన అనంతరం పసుపు-కుంకుమలు, రవికె వస్త్రం, గాజులు, శ్రీ అమ్మవారి ప్రసాదాలను అందజేయడంతో పాటు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా శ్రీ దుర్గమ్మ ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పించారు. దేవస్థానం చేసిన ఈ విశేష ఏర్పాట్లపై మహిళా భక్తులు విశేష హర్షం వ్యక్తం చేశారు.

​ఈ సామూహిక పూజల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) సతీమణి శ్రీమతి అంజలి సామాన్య మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి శ్రీ వి.కె. శీనా నాయక్ మహా మండపానికి విచ్చేసి వరలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.

​ఈ సందర్భంగా ఈవో శ్రీ వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ..

"ధనిక, పేద అనే తేడా లేకుండా భక్తులందరికీ అమ్మవారి దివ్య సేవలో భాగస్వామ్యం కల్పించాలనే సమున్నత లక్ష్యంతో మొదటి విడత ఆర్జిత సేవగా, రెండో విడతలో 600 మందికి పైగా మహిళలకు ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించాము. సనాతన ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మ ప్రచారానికి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి" అని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ,వైదిక కమిటీ సభ్యులు వి. శ్రీధర్ శర్మ,ఫెస్టివల్ సహాయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె. గంగాధర్,పర్యవేక్షకులు హేమ దుర్గాంబ , సీనియర్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada

Next Story