Vijayawada: ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు శనివారం మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు!
Vijayawada: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర వార్షిక పవిత్రోత్సవాలు’ శనివారం నాటితో శాస్త్రోక్తంగా, వైభవంగా ముగిశాయి.
ముగింపు రోజైన శనివారం ఉదయం 9:30 గంటలకు కొండపై ఉన్న పాత యాగశాలలో ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్రోత్సవాల ముగింపు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పాత యాగశాలలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ యజ్ఞ పరిసమాప్తిని సూచిస్తూ వేద పండితులు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం యాగశాలలో పూజించిన పవిత్ర జలాలతో దేవతామూర్తులకు, ఆలయ ప్రాంగణానికి సంప్రోక్షణ చేస్తూ శాంతి మార్జనము, ఆశీర్వచనం నిర్వహించారు.
ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల నివారణార్థం, లోక కళ్యాణార్థం ఈ పవిత్రోత్సవాలను ఆనవాయితీ ప్రకారం వైదికంగా నిర్వహించినట్లు వైదిక కమిటీ తెలిపింది. పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు శ్రీ కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య, శ్రీ కోట రవి కుమార్, వైదిక కమిటీ సభ్యులు శ్రీ శ్రీధర్ శర్మ ఆశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు మరియు శేషవస్త్రాలను బహూకరించారు.




