Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా క్యూలైన్ల నిర్మాణ పనులు ప్రారంభం!

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల క్యూలైన్ల పనులు ప్రారంభం. వన్ టౌన్ వినాయక గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈవో శీనా నాయక్.

Satyanarayana, Vijayawada
Published on: 13 Sept 2026 12:25 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా క్యూలైన్ల నిర్మాణ పనులు ప్రారంభం!

Indrakeeladri: ​విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు–2026’ ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

​ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాల సందర్భంగా క్యూలైన్లు ప్రారంభమయ్యే వన్ టౌన్ వినాయక గుడి వద్ద విఘ్నేశ్వర పూజ నిర్వహించి పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ వైదిక కమిటీ నిర్ణయించిన శుభ ముహూర్తాన ఉదయం 7:30 గంటలకు పనులకు అంకురార్పణ చేశారు.

కెనాల్ రోడ్ వినాయక గుడి ప్రాంగణం వద్ద మరియు ఘాట్ రోడ్డు ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి క్యూలైన్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించి, ఉత్సవాలు నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలని గణనాథుని ప్రార్థించారు.

​ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుండి వచ్చిన ఆదేశాలు పాటించి సకాలంలో పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన్నట్లు పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఎల్. రమాదేవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ అశోక్ కుమార్, శ్రీ రవీంద్ర, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ మస్తాన్ తదితర ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada