Vijayawada: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాదం ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవం!
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అన్నప్రసాదం ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన దేవస్థానం ఈవో. రూ.36.82 లక్షల ఆదాతో అత్యాధునిక వంటశాల ఏర్పాటు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాదం ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవం!
Vijayawada: కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న రీతిలో 'ప్రైవేటుకు ప్రసాదం' అనే అంశం అవాస్తవం, నిరాధారమైనదని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్పష్టం చేశారు.
భక్తులకు అందించే పవిత్ర అన్నప్రసాద వితరణను ఏ ప్రైవేట్ సంస్థకూ అప్పగించడం లేదని, భక్తులకు అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన, నాణ్యమైన మరియు రుచికరమైన అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం ముందుచూపుతో ఆలోచన చేసి అత్యాధునిక స్టీమ్ ఆధారిత వంటశాల (Modern Mechanized Kitchen) పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుందని వివరించారు.
వాస్తవాలు
1. అన్నదాన నిర్వహణ ఎవరికీ అప్పగించలేదు:
కొందరు ప్రచారం చేస్తున్నట్లు దేవస్థానం అన్నదానం తయారీ, పంపిణీ బాధ్యతలను ఏ ప్రైవేట్ సంస్థకూ కట్టబెట్టలేదు.
నిత్యాన్నదాన నిర్వహణ, పర్యవేక్షణ, మెనూ, నాణ్యతా ప్రమాణాలు మరియు భక్తులకు వడ్డించే ప్రక్రియ అంతా ఎప్పటిలాగే పూర్తిగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది.
2. ముందుచూపుతో అత్యాధునిక వంటశాల నిర్మాణం:
ఇంద్రకీలాద్రికి వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని వేగంగా అందించడమే దేవస్థాన ప్రాథమిక లక్ష్యం.
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆహార తయారీలో అత్యున్నత పరిశుభ్రత (GMP & FSSAI నిబంధనల ప్రకారం) పాటించేందుకు, ఆహార వృథాను అరికట్టేందుకు, మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక స్టీమ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని దేవస్థానం వినియోగిస్తోంది.
3. రూ. 36.82 లక్షల దేవస్థాన నిధుల ఆదా:
తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) మెకనైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసిన ‘టెక్నోలాజిక్ ఇంజనీర్స్ ఇండియా ప్రై.లి.’ సంస్థ ఈ పరికరాల సరఫరా మరియు ఇన్స్టాలేషన్ కొరకు రూ. 2,31,82,668/- (జీఎస్టీ, రవాణా ఖర్చులు అదనం) కోట్ చేసింది.
దేశవ్యాప్తంగా లక్షలాది మందికి పరిశుభ్రమైన వంటశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్న అనుభవం కలిగిన హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ / అక్షయపాత్ర ఫౌండేషన్ (HKMCF APCR) వారు అదే ఆధునిక పరికరాలను కేవలం రూ. 1.95 కోట్లకు (రూ. 1,95,00,000/-) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
దీని ద్వారా దేవస్థానానికి ఏకంగా రూ. 36,82,668/- నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రతిపాదనను ఆలయ ధర్మకర్తల మండలి క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించగా, ప్రభుత్వం (Memo No. REV01-ENDW/982/2026-VIG-VII, Dt: 20-08-2026) అనుమతి మంజూరు చేసింది.
4. కేవలం మెషినరీ ఏర్పాటు, సాంకేతిక సహకారం మాత్రమే:
అక్షయపాత్ర ఫౌండేషన్ బాధ్యత కేవలం రోజుకు 10,000 మందికి సరిపడా ఆహారాన్ని తయారుచేసే అధునాతన స్టీమ్ కుకింగ్ పరికరాలు, స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ పాత్రలు, యుటిలిటీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం, కమిషనింగ్ మరియు సిబ్బందికి నిర్వహణలో సాంకేతిక శిక్షణ ఇవ్వడం వరకే పరిమితం.
ఈ పనులన్నీ దేవస్థాన ఇంజనీరింగ్ విభాగం సాంకేతిక పర్యవేక్షణలోనే పారదర్శకంగా జరుగుతాయి.
5. రూ. 6 కోట్ల అదనపు భారం అనేది పూర్తిగా కల్పితం:
ప్లేట్‌కు ఇంత మొత్తం చొప్పున చెల్లిస్తూ దేవస్థానంపై ఏటా రూ. 6 కోట్ల భారం పడుతుందన్న కథనం పూర్తిగా ఊహాజనితం, అవాస్తవం.
ప్రతిపాదనలో సూచించిన అంశాలు సంస్థలు తమ ప్రామాణిక సమాచారం కోసం తెలిపిన సాంకేతిక అంచనాలు మాత్రమే తప్ప, దేవస్థానం ఎలాంటి నిర్వహణ లేదా పంపిణీ కాంట్రాక్టు ఎవరికి ఇవ్వలేదని తెలియజేయడమైనది.
ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తజన కోటికి అత్యున్నత నాణ్యతతో, ఆరోగ్యకరమైన ప్రసాదాన్ని అందించేందుకు దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి చర్యలపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలను, నిరాధారమైన కథనాలను భక్తులు ఎవరూ నమ్మవద్దని దేవస్థానం విజ్ఞప్తి చేస్తోందని ఈవో తెలిపారు.




