Jogi Ramesh: భూకబ్జా ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం: జోగి రమేశ్ సవాల్!

Jogi Ramesh: గుంటూరు ఇరిగేషన్ భూముల కబ్జాతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 30 Aug 2026 10:05 PM IST
Jogi Ramesh
X

Jogi Ramesh: భూకబ్జా ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం: జోగి రమేశ్ సవాల్!

Jogi Ramesh: తనపై పత్రికలో వచ్చిన గుంటూరు ఇరిగేషన్ స్థ‌లం కబ్జా కథనంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. పత్రిక ఉంది కదా అని ఇష్టానుసారంగా కల్పిత వార్తలు రాయడం తగదని హెచ్చరించారు. ఆ స్థలంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విజిలెన్స్ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంకా ఏమ‌న్నారంటే.. :

ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో 'జోగి భూకబ్జా' అంటూ గుంటూరులో రూ.25 కోట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు రాశారు. దయచేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. గుంటూరు ఇరిగేషన్ స్థలంలో జోగి రమేష్ పాత్ర ఏమిటి? నా ఏజెంట్ ఎవడో, అసలు దీనికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తి ఎవడో, అనుచరుడు ఎవడో తేల్చండి.

పేపరుంది కదా అని బురద జల్లేద్దాం, వాడే కడుక్కుంటాడులే అని ఈ స్థాయికి దిగజారొద్దు. ఉన్న ఒకటో రెండో స్థలాలనే అప్పులు కట్టలేని పరిస్థితుల్లో అమ్మేసుకున్న పరిస్థితి నాది. దమ్ముగా రాజకీయం చేశాం గానీ, డబ్బుల కోసం కక్కుర్తి పడి రాజకీయాలు చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నిష్పక్షపాతంగా విజిలెన్స్ విచారణ జరిపించి నిజాలను నిర్భయంగా బయటపెట్టాలి.

నా కుటుంబాన్ని వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే నా కుమారుడు రాజీవ్‌పై కనీసం ఆధారాలు లేకపోయినా భూవివాదం కేసు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారు. ఆ తర్వాత నకిలీ మద్యం అని వార్తలు సృష్టించి నన్ను, నా తమ్ముడిని 83 రోజుల పాటు అకారణంగా జైల్లో పెట్టారు. నా ఇంటిపై దాడి చేసి మా కుటుంబంపై హత్యాయత్నం చేసిన కేసుకు సంబంధించి ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? నా కుమారుడు, కోడలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా రాజకీయాన్ని చొప్పించి, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ మమ్మల్ని ఈ విధంగా లాగటం మీకు ధర్మమేనా? ఒక కుటుంబంపై దాడులు చేసి, విచ్ఛిన్నం చేసి మా కుటుంబ గొంతును నొక్కాలని చూస్తున్నారు.

పోరాటం ఆపే ప్ర‌స‌క్తే లేదు

యువజన కాంగ్రెస్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి 19 ఏళ్ల వయసు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన నన్ను, నా కొడుకుని, నా కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని దుర్మార్గంగా వ్యవహరించడం సబబేనా? బలహీన వర్గాల్ని ఇంకా బలహీనుల్ని చేయాలని కంకణం కట్టుకున్నారేమో. జోగి రమేష్ రాజకీయాల్లో ఉన్నాడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడు, జగన్ గారి గొంతు వినిపిస్తున్నాడు అనే ఒక్క కుట్ర తప్ప ఇంకేముందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నా గొంతును నొక్కటం మీ వల్ల కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడానికి, జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం కోసం నా గొంతు వినిపిస్తూనే ఉంటా.

దమ్ముంటే క‌బ్జా చేసిన‌ట్టు నిరూపించాలి

బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు, కేసులు పెట్టడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇంకా ఆనందం పొందాలంటే ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో పెట్టండి, జైలుకు పంపించండి. తప్పుడు వార్తలు రాసి పేపర్ల చుట్టూ తిప్పి కేసులుగా మార్చి అరెస్టులు చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని ఆపాలని కోరుతున్నాను. నాపై మోపిన నిందలపై దమ్ముగా చెబుతున్నా.. పూర్తి స్థాయి విచారణ జరిపించండి. అలాగే ఇక నుంచి అయినా ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని రాధాకృష్ణకు తేల్చి చెప్పారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story