Off The Record: లోకల్ ఎలక్షన్స్‌పై పార్టీ నేతలకు జగన్ వార్నింగ్!

Off The Record: 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీకి స్థానిక ఎన్నికలు కీలకం. పార్టీ పునర్నిర్మాణంపై జగన్ దృష్టి సారించగా క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Sept 2026 10:21 AM IST
Off The Record
X

Off The Record: లోకల్ ఎలక్షన్స్‌పై పార్టీ నేతలకు జగన్ వార్నింగ్!

Off The Record: వైసీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి ఎదురైన రాజకీయ దెబ్బ నుంచి బయటపడేందుకు వైసీపీ అధినేత జగన్ క్షేత్రస్థాయిలో పార్టీని తిరిగి నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించడం.. కోఆర్డినేటర్లు గ్రామాలు, వార్డుల్లో పర్యటించడం వంటి కార్యక్రమాలకు పార్టీ శ్రీకారం చుట్టింది వైసీపీ.

స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇప్పటికే వైసీపీ అధినేత స్పష్టమైన పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.

అంటే.. వైసీపీ అధినాయకత్వం స్థానిక ఎన్నికలను కేవలం మరో ఎన్నికగా కాకుండా.. పార్టీ పునర్నిర్మాణానికి ప్రధాన వేదికగా చూస్తోందని స్పష్టమవుతోంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే.. అధినేత ఇచ్చిన ఈ పిలుపు కింది స్థాయిలో ఎంతవరకు పనిచేస్తోంది..?2024 తర్వాత కొందరు నాయకులు యాక్టివ్‌గా కొనసాగుతున్నప్పటికీ..

మరికొందరు రాజకీయంగా సైలెంట్‌గా మారారన్న చర్చ లేకపోలేదు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు అవసరమైన ఆర్థిక, సంస్థాగత, నాయకత్వ వనరులు పార్టీకి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రతి స్థానంలో పోటీ చేయాలన్న లక్ష్యం ఒకటైతే.. ప్రతి చోట బలమైన అభ్యర్థులను నిలబెట్టగలగడం మరో అంశం.

వైసీపీకి మరో పెద్ద సవాల్. స్థానిక నాయకత్వం.. గ్రామస్థాయిలో గతంలో బలంగా ఉన్న నాయకులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు..? మాజీ ఎంపీపీలు.. జెడ్పీటీసీలు.. సర్పంచులు.. వార్డు నాయకులు పార్టీతో కొనసాగుతున్నారా..? లేక వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారా..? అన్నది స్థానిక ఎన్నికల ముందు వైసీపీకి అత్యంత కీలకమైన ప్రశ్నగా మారుతోంది.

అయితే పార్టీ పూర్తిగా డీలా పడిందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. జగన్ వరుసగా జిల్లా స్థాయి నాయకులు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు. రాజమండ్రి రూరల్‌కు చెందిన స్థానిక నాయకులతో జరిగిన సమావేశంలోనూ ఎన్నికలకు సిద్ధం కావాలని స్పష్టమైన పిలుపునిచ్చారు.

వైసీపీకి స్థానిక ఎన్నికలు గెలవడం మాత్రమే కాదు.. పార్టీకి కేడర్ ఉందని నిరూపించుకోవడం కూడా కీలక పరీక్షగా మారింది. ఒకవేళ పెద్ద సంఖ్యలో స్థానిక స్థానాల్లో పోటీ చేసి.. గణనీయమైన విజయాలు సాధిస్తే.. 2024 ఓటమి తర్వాత పార్టీ తిరిగి పుంజుకుంటోందన్న రాజకీయ సంకేతం వెళ్లే అవకాశం ఉంది.

మరోవైపు.. అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడినా.. లేదా భారీ ఓటమి ఎదురైనా.. పార్టీ బలహీనతపై రాజకీయ చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే వైసీపీలో ఇప్పుడు అసలు చర్చ.. “ఎన్నికల్లో గెలుస్తామా..?” అన్నదాని కంటే.. “ఎంత బలంగా తిరిగి రంగంలోకి దిగగలుగుతాం..?” అన్నదానిపైనే సాగుతోంది.

జగన్ ఇచ్చే రాజకీయ దిశానిర్దేశం.. జిల్లా నాయకత్వం అమలు చేసే వ్యూహం.. గ్రామస్థాయి కేడర్ స్పందన.. ఈ మూడు అంశాలు కలిస్తేనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ అసలు బలం బయటపడుతుంది. ప్రస్తుతం పార్టీ దృష్టి మొత్తం క్షేత్రస్థాయి పునర్నిర్మాణంపైనే ఉందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

స్థానిక సమరం ద్వారా పార్టీ పునరుజ్జీవానికి బాటలు వేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి జగన్ ఇచ్చిన పిలుపు క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఫలిస్తుంది..? స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎంతమేర సత్తా చాటుతుంది..? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story