Off The Record: కర్నూలు బీజేపీలో వేరు కుంపట్లు!

Off The Record: ఎమ్మిగనూరులో అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న బీజేపీ, జనసేన. కూటమి పార్టీల వర్గపోరుతో బలపడుతున్న టీడీపీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Aug 2026 7:25 AM IST
Off The Record
X

Off The Record: కర్నూలు బీజేపీలో వేరు కుంపట్లు!

Off The Record: ఎమ్మిగనూరులో అంతర్గత విభేదాలతో కూటమి పార్టీల పరిస్థితి గందరగోళంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీలో నాయకులు ఒకే తాటిపై లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారుతోందనే అభిప్రాయం కేడర్ లో నెలకొంది.

అధికారంలోకి వచ్చాక బీజేపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నాయకులు మాట్లాడుకుంటున్నారు. బీజేపీ నాయకుల మధ్య ఎంత గ్యాప్ ఉందంటే ఎమ్మిగనూరులో బీజేపీకి మూడు పార్టీ ఆఫీసులు ఉన్నాయి. మూడు వర్గాల నాయకులు ఎవరికి వారు సొంత పార్టీ ఆఫీస్ లను ఏర్పాటు చేసుకున్నారు.

బీజేపీలోని ఒక వర్గం టీడీపీ ఎమ్మెల్యేకు దగ్గరగా ఉంటే... మరో వర్గం వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటోందన్న చర్చ జరుగుతోంది. ఇంకో వర్గం ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తోందనే టాక్ ఉంది. దీంతో ఎమ్మిగనూరులో బీజేపీ నాయకత్వం మూడు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే బీజేపీకి ఎమ్మిగనూరులో బలమైన కేడర్ లేదనే చర్చ ఉండగా.. నాయకుల తీరు ఆ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై దీని ప్రభావం పడొచ్చనే చర్చ జరుగుతోంది.

కూటమిలో మరో పార్టీ అయిన జనసేన పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన సింగిల్‌గా బరిలోకి దిగగా.. నాడు రేఖాగౌడ్ గాజు గ్లాస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమే నియోజకవర్గం ఇంచార్జీగా కొనసాగుతున్నారు.

అయితే ఇంచార్జీ బాధ్యతా తీసుకున్నాక ఆమె నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదని, పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా నామా మాత్రంగానే పాల్గొన్నారనే టాక్ ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి మరో నాయకుడు జనసేన ఇంచార్జీ బాధ్యతల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా అది వర్కవుట్ కాలేదు. దీంతో అసమ్మతితో ఆ నేత పార్టీకి కొంత గ్యాప్ మెయిన్‌టైన్ చేస్తున్నారట. ఇంచార్జీగా తనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి.. పార్టీ కోసం పనిచేసినా అది వేరే వాళ్లకు క్రెడిట్ వెళ్తుందనే భావనలో ఆయన ఉండిపోయారట.

ఎమ్మిగనూరులో జనసేనకు కూడా రెండు పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఇలా కూటమిలోని రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు, వర్గపోరు సొంత వ్యవహారాలతో...పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ ఇబ్బంది పడుతున్నారట.

రొట్టె ముక్క కోసం పిల్లి పిల్లి తగువులాడుకున్నట్టు బీజేపీ, జనసేన నేతల తీరు ఉంటే.. ఓ వైపు టీడీపీ పార్టీ తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. ముఖ్యంగా జాయినింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందట. స్థానిక నేతలను, కార్యకర్తలను సైకిల్ ఎక్కించుకుంటున్నారట. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ టీడీపీ ఇమేజ్ ను పెంచుతున్నారట. బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం నేతల కుమ్ములాటలతో సతమతం అవుతోందట.

ఆయా పార్టీల అధ్యక్షులు నియోజకవర్గంపై దృషి పెట్టకపోవడం పెద్ద మైనస్. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన నాయకులు.. సొంత కుంపటి ప్రయత్నాలతో పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారట. కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ ముందుకు వెళ్తుంటే భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన మాత్రం అంతర్గత వ్యవహారాలతోనే సతమతమవుతున్నాయనే టాక్ నడుస్తోంది.

ఎమ్మిగనూరులో టీడీపీ అంతకంతకు పుంజుకుంటుంటే.. బిజెపి జనసేన అంతకంత దిగాజారిపోతున్నాయట. రెండు పార్టీలు నియోజకవర్గంలో అసలు ఉన్నాయా లేదా అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికైనా రెండు ప్రధాన పార్టీలు నియోజకవర్గంపై దృషి సరించకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ధర్మంగా తమకు వచ్చే సీట్లు కూడా కోల్పోయే అవకాశం లేకపోలేదు. మరి రెండు పార్టీల అధినేతలు.. పార్టీని చక్కబెడతారా లేక గమ్మునుండి పోతారా వేచి చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story