Off The Record: రేవంత్ కీలక నిర్ణయం..! నల్గొండ నుంచి కేబినెట్ లోకి ఆ ఎమ్మెల్యే
Off The Record: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం వేడెక్కింది. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ నెరవేరుతుందా?
Off The Record: రేవంత్ కీలక నిర్ణయం..! నల్గొండ నుంచి కేబినెట్ లోకి ఆ ఎమ్మెల్యే
Off The Record: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి హేమాహేమీలు కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మూడో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మధ్య ఈ పోటీ రసవత్తరంగా సాగుతోంది.
మునుగోడులో ఉపఎన్నిక నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అంతా హైడ్రామానే. ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవిపై అధిష్టానం బలమైన హామీ ఇచ్చిందని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ ఇంటికి వెళ్లి హామీ ఇచ్చారని టాక్. అందుకే ఈసారి విస్తరణలో తన పేరు ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ, తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదని, మంత్రుల జిల్లాలకే నిధులు వెళ్తున్నాయని రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారితీశాయి..
మరోవైపు సామాజిక సమీకరణాలు బాలు నాయక్‌కు కలిసివచ్చేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న లంబాడీ సామాజిక వర్గానికి కేబినెట్‌లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బాలు నాయక్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమించి ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు రేవంత్ రెడ్డి. జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఉండటంతో, మూడో వ్యక్తిని కూడా అదే వర్గం నుంచి తీసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని అధిష్టానం భావిస్తోందట. అందుకే ఎస్టీ కోటాలో బాలు నాయక్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే రాజగోపాల్ రెడ్డికి అసలైన చిక్కు తన సొంత అన్న వెంకటరెడ్డి రూపంలోనే ఎదురవుతోందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సంప్రదాయం కాదని కొందరు అడ్డుపుల్ల వేస్తున్నారట. దీనికి తోడు, రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన "అవసరమైతే నేనే సీఎం అవుతా" అనే కామెంట్లు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయని, అది ఆయన పదవికి ఎసరు పెడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటు బాలు నాయక్ మాత్రం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్నారు. అధిష్టానం వద్ద గిరిజన కార్డును బలంగా వినిపిస్తున్నారు. కేరళ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని సీఎం ప్రకటించడంతో, ఇద్దరు నేతలు ఢిల్లీ స్థాయిలో పైరవీలు ముమ్మరం చేశారట. రాజగోపాల్ రెడ్డి తన పాత హామీని గుర్తు చేస్తుండగా, బాలు నాయక్ సామాజిక న్యాయం కావాలంటున్నారు. ఈ ఇద్దరిలో రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
మొత్తానికి నల్గొండ ఖిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? అధిష్టానం హామీ గెలుస్తుందా లేక సామాజిక సమీకరణం నెగ్గుతుందా? రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చల్లారుతుందా లేక బాలు నాయక్ గిరిజన గళం కేబినెట్‌లో వినబడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి..


