Burning Topic: అంగ, కళింగ తర్వాత వంగ రాజ్యాన్ని జయించిన బీజేపీ.. దశాబ్దాల నిరీక్షణకు దక్కిన ఫలితం!

West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించింది. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ, శ్యామప్రసాద్ ముఖర్జీ జన్మస్థలంలో కమలదళం మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2026 12:50 PM IST
Burning Topic
X

Burning Topic: అంగ, కళింగ తర్వాత వంగ రాజ్యాన్ని జయించిన బీజేపీ.. దశాబ్దాల నిరీక్షణకు దక్కిన ఫలితం!

Burning Topic: బీజేపీ చారిత్రిక విజయంతో బెంగాల్ రాజకీయాలు మలుపు తిరిగాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనానికి 15 ఏళ్ల పాటు కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత కారణమని ప్రాథమిక విశ్లేషణ. 'మా, మాటీ, మానుష్' నినాదంతో అధికారంలోకి మమతా బెనర్జీ ప్రజల మధ్య విశ్వాసం కోల్పోయి ఓటమి పాలయ్యారు. 2021లో చేజారిన అవకాశాన్ని 2026లో బీజేపీ భారీ మెజారిటీతో అందిపుచ్చుకుని బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. నిజమైన అభివృద్ధి జరగాలంటే ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు ఫలించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే విజయం కట్టబెట్టారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. అంగ, కళింగ రాజ్యాలను ఇప్పటికే కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఇప్పుడు వంగ రాజ్యాన్ని సైతం జయించింది. మొట్ట మొదటిసారిగా బెంగాల్‌లో జయకేతనం ఎగురవేసింది. అయితే బెంగాల్‌ను గెలుచుకోవడం కోసం బీజేపీ దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయడాన్ని బీజేపీ సెంటిమెంట్‌గా తీసుకుంది. ఇందుకు చారిత్రిక కారణాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు బెంగాల్ నేల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చైతన్యానికి కేంద్రంగా ఉండేది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. అప్పట్లో దేశ రాజధాని కలకత్తా. బ్రిటీష్ పాలనపై సాయుధ పోరాటాలకు, ఉద్యమాలకు బెంగాల్ బిందువుగా ఉండేది. ఎందరో వీరులు, విప్లవకారులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరో గొప్ప నాయకులు బెంగాల్‌లో జన్మించారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బంకించంద్ర చటర్జీ, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, అరబింద ఘోష్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, బిపిన్ చంద్ర పాల్, రాస్ బిహారీ బోస్, ఖుదీరామ్ బోస్, చిత్తరంజన్ దాస్, శ్యామప్రసాద్ ముఖర్జీ, రాజా రామ్మోహన్ రాయ్, జగదీష్ చంద్రబోస్, శరత్ చంద్ర చటోపాధ్యాయ, కేశబ్ చంద్ర సేన్, ప్రఫుల్ల చంద్ర రాయ్, సత్యేంద్రనాథ్ బోస్ వీరిలో కొందరు

దేశం రేపు ఏం ఆలోచిస్తుందో, బెంగాల్ ఇవాళ దాన్ని ఆచరిస్తుందని అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. స్వాతంత్ర్య సమర పోరాటాన్ని దెబ్బ తీయడానికి బ్రిటిష్ నాటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ తొలిసారిగా 1905లో బెంగాల్‌ను విభజించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విభజన చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అసలు ఉద్దేశం భారతీయులలో పెరుగుతున్న జాతీయవాదాన్ని దెబ్బతీయడం. హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం. దీంతో బెంగాల్ సమాజం ఒక్కసారి భగ్గమంది. దేశవ్యాప్తంగా వందేమాతరం ఉద్యమం మొదలైంది, స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ భారత స్వాతంత్ర్య కాంక్షను మరింత బలపరిచింది. దీంతో బ్రిటిష్ వారు దిగిరాక తప్పలేదు. తీవ్రమైన నిరసనలు, ఉద్యమాల కారణంగా 1911లో అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్-II బెంగాల్ విభజనను రద్దు చేశారు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చింది.

ఆ తర్వాత భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే క్రమంలో బ్రిటి‌ష్ వారు దేశ విభజన చేపట్టారు. ముస్లింలీగ్ బెంగాల్ మొత్తాన్ని పాకిస్థాన్ లో కలపాలని కుట్రలు పన్నింది. అప్పుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అడ్డుపడి హిందూ ఆధిక్యత ఉన్న భూభాగాలు భారత్ లోనే ఉండాలని ఉద్యమించారు. ఫలితంగా 34% బెంగాల్ కొత్త దేశంలో కలవకుండా ఆ ఆపగలిగారు. అదే నేటి పశ్చిమ బెంగాల్. ఇవాళ పశ్చిమ బెంగాల్ భారత దేశంలోనే ఉందంటే అది శ్యామప్రసాద్ ముఖర్జీ పోరాట ఫలితమే.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రముఖ విద్యావేత్త, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు. తర్వాత కాలంలో హిందూ మహాసభలో క్రియాశీకలంగా పని చేశారు. స్వాతంత్ర్యానంతరం జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పాటైన స్వాతంత్ర భారత తొలి క్యాబినెట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖమంత్రిగా పని చేశారు.. నెహ్రూ విధానాలతో విసుగొచ్చి 1950లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు..

శ్యామప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు. ఇది నేటి బీజేపీకి పూర్వ రూపం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారు. కాశ్మీర్ వెళ్లి నిరాహార దీక్ష తలపెట్టారు. ఈ క్రమంలో అరెస్టయి కాశ్మీర్ జైలులో జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు శ్యామ ప్రసాద్జీ. ఆయన మరణంపై విచారణ జరిపించాలని జనసంఘ్ డిమాండ్ చేసినా ప్రధాని నెహ్రూ పట్టించుకోలేదు. ముఖర్జీ మరణం నేటికీ అనుమానాస్పదంగా మిగిలింది. ఇకప్పుడు జాతీయ వాదానికి కేంద్రంగా ఉన్న బెంగాల్ నేల మీద పుట్టిన శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్, బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరించి కేంద్రంలో అధికారం చేపట్టింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డా, బెంగాల్‌ మాత్రం ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. అందుకోసం సుదీర్ఘ పోరాటాలు చేయాల్సి వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.. ఆ తర్వాత 1977 నుండి 2011 వరకు వామపక్షాలు అధికారంలో కొనసాగాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బెంగాల్‌లో మొదటి నుంచి బీజేపీకి పరిస్థితులు కలిసిరాలేదు. ప్రతి ఎన్నికల్లో ఓట్లు పెరుగుతున్నా సీట్లు మాత్రం రాలేదు. బెంగాల్‌ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న బీజేపీ కోరిక దశాబ్దాలపాటు నెరవేరలేదు. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ ఏనాడూ నిరాశ చెందలేదు. పట్టుదలతో పోరాడుతూ పైకి ఎదిగింది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ ఏనాడూ నిరాశ చెందలేదు. పట్టుదలతో పోరాడుతూ పైకి ఎదిగింది. రామజన్మభూమి ఉద్యమం బెంగాల్‌లో బీజేపీకి ఊపునిచ్చింది. 1998లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ తొలిసారిగా ఒక స్థానాన్ని గెల్చుకుంది.

బెంగాల్‌లో బీజేపీ 1999లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో జట్టుకట్టి 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాలు గెలుచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 291 సీట్లలో పోటీచేసి, తొలిసారిగా మూడు స్థానాలు గెల్చుకొని పెను సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి బీజేపీకి ఎదుగుదలకు అడ్డే లేకుండాపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లలో పోటీకి దిగి, 2.89 కోట్ల ఓట్లు సాధించి, 77 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారిగా రెండో అతిపెద్ద పార్టీగా మారింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మమతా బెనర్జీ బీజేపీని బయటి పార్టీగా ప్రచారం చేయడం ఇబ్బందిగా మారింది. తమ పార్టీ వ్యవస్థాపకుడు పుట్టిన నేల బీజేపీ అని గర్వంగా చెప్పుకునేది. భారత్‌లో పశ్చిమ బెంగాల్‌ భాగంగా ఉందంటే అది శ్యామాప్రసాద్‌ చలవేనని బీజేపీ చెబుతుంది. ఇంత కాలానికి బీజేపీ పోరాటాలు ఫలించి బెంగాల్ నేల మీద అధికారం చేపట్టడం బీజేపీ శ్రేణులకు ఆనందం కలిగిస్తోంది.

స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ బెంగాల్ ఎంతగానో మారిపోయింది. సుదీర్ఘకాలం కొనసాగిన వామపక్ష, తృణమూల్ ప్రభుత్వాల హయంలో రాజకీయం, సాంస్కృతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు దేశానికి రాజధానిగా ఉన్న బెంగాల్ ఇప్పుడు తన అస్థిత్వాన్ని కోల్పోయింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పశ్చిమ బెంగాల్ అస్థిత్వానికి ప్రమాదకరంగా మారాయి. వామపక్ష, తృణమూల్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలతో బెంగాల్‌ను నాషనం చేశాయని బీజేపీ విమర్శిస్తోంది. దేశంలో తొలి యూనివర్సిటీ, తొలి మెడికల్ కాలేజీ, తొలి ఐఐటీ, తొలి ఐఐఎం బెంగాల్‌లో ఏర్పడ్డాయి. ఒకప్పుడు పారిశ్రామిక రంగంలో బెంగాల్ దేశంలోనే అగ్రగామి. కానీ బెంగాల్‌లో అభివృద్ధి క్షీణించిపోయి వెనుకబండి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో బెంగాల్‌లో జాతీయవాద పునరుద్దరణ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామని కమలనాథులు చెబుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story