Off The Record: విజయసాయి రెడ్డి కొత్త పార్టీ టార్గెట్ ఎవరు ?

Off The Record: వైసీపీకి దూరమైన విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు పార్టీ పేరు, అజెండా ప్రకటన.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Sept 2026 7:14 AM IST
Off The Record
X

Off The Record: విజయసాయి రెడ్డి కొత్త పార్టీ టార్గెట్ ఎవరు ?

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊరిస్తూ వస్తున్న కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైంది. వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సుదీర్ఘ కాలంపాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, వైసీపీలో రెండో ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా చలామణి అయిన సాయిరెడ్డి.. తాజాగా ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. కొత్త పార్టీ కోర్ థీమ్ ఎలా ఉంటుందో స్పష్టం చేశారు.

రాబోయే దసరా పండుగ రోజున కొత్త పార్టీ పేరు, జెండా, పూర్తి స్థాయి అజెండాను అధికారికంగా ప్రకటిస్తానన్నారు విజయసాయిరెడ్డి. అయితే సోషల్ మీడియాలో 'భారత్ జన వికాస్' అనే పేరు వైరల్ అవుతోంది. విజయసాయిరెడ్డి తన కొత్త పెట్టపోయే కొత్త రాజకీయ పార్టీకి అదే పేరు పెడతారా..? లేదా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

కానీ.. ఏపీలో ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ది 'రెడ్ బుక్' పాలన అని, వైసీపీ ది 'రప్పా రప్పా' పార్టీ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల ఫ్యాక్షన్ రాజకీయాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆరోపించారు.

రాజకీయాల్లో సహజంగా కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనతోపాటే తానే ఆ పార్టీకి ముఖ్యమంత్రిని కావాలన్న కోరిక కూడా ఉంటుంది. విజయసాయిరెడ్డి మాత్రం తన పార్టీకి తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని తేల్చి చెప్పారు. అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఎలాంటి పదవులు తీసుకోరని నిర్మోహమాటంగా ప్రకటించారు.

శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో తాను కేవలం వెనుక ఉండి పార్టీని నడిపించే ఒక 'మెంటర్' పాత్రను మాత్రమే పోషిస్తానని వెల్లడించారు. ఏపీలో ఎప్పుడూ రెడ్లు, కమ్మ సామాజిక వర్గాలే సీఎంలు కావాలా..? అని ప్రశ్నించారు. భవిష్యత్‌ ఎన్నికల్లో తమ పార్టీలో సమర్థత ఉన్నవారికే సీఎం పీఠం దక్కుతుందని తన మనసులో మాట ప్రకటించారు.

బీసీ లేదా యువతకు పెద్దపీట వేస్తానని, బహుశా ఆ వర్గాలకే సీఎం పీఠాన్ని కూడా కట్టబెట్టే అవకాశం ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలో 66శాతం సీట్లను జెన్ జీ యువతకే కేటాయిస్తామని ప్రకటించారు సాయిరెడ్డి.

అయితే.. 2025 జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి నుంచి విజయసాయిరెడ్డి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జగన్ విధానాలతో విభేదించడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఒకప్పుడు వైఎస్సార్, జగన్‌లకు ఆర్థిక, రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన సాయిరెడ్డి.. ఇప్పుడు ఎవరి కిందో కాకుండా తానే ఒక రాజకీయ శక్తిగా మారాలని భావిస్తున్నారు. అందుకే అమరావతి రాజధానికి కూడా పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించి కోస్తాంధ్ర ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నాయకుడు, వ్యూహకర్త ఒంటరిగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించి నడపాలంటే భారీ ఆర్థిక వనరులు, బలమైన వ్యవస్థ అవసరం.

చార్టర్డ్ అకౌంటెంట్‌గా దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలతో విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని సాయిరెడ్డి భావిస్తున్నారన్న ఊహాగానాలు లేకపోలేదు.

ఇందులోభాగంగా కొందరు పారిశ్రామికవేత్తలు, అసంతృప్త నేతలు సాయిరెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు విజయసాయిరెడ్డి.. సొంతంగా ఒక సరికొత్త మీడియా సంస్థను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తానికి టీడీపీ, వైసీపీలు మాత్రమే తన టార్గెట్ చెబుతున్న సాయిరెడ్డి.. జనసేన, బీజేపీ జోలికి మాత్రం పోలేదు. ఇది వ్యూహాత్మకమా..? అన్న చర్చ జోరందుకుంది. దేశవ్యాప్తంగా జెన్ జీ ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో.. సాయిరెడ్డి కూడా యువ మంత్రం జపిస్తున్నారా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలా..జగన్ నీడ నుంచి బయటకు వచ్చి.. "బాల్ థాకరే" లా కింగ్ మేకర్ కావాలనుకుంటున్న విజయసాయిరెడ్డి వ్యూహం దసరా నాటికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story