Burning Topic: భారతీయులకు అమెరికా మరో షాక్!
Burning Topic: అమెరికాలో హెచ్-1బీ వీసా 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ప్రతిపాదన. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ 'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై భారతీయ అమెరికన్లు, సిక్కు సంఘాల తీవ్ర ఆగ్రహం.
Burning Topic: భారతీయులకు అమెరికా మరో షాక్!
Burning Topic: మేక్ అమెరికా గ్రేట్ అగైన్, స్థానికులకే తొలి ప్రాధాన్యత పేరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న వలసదాల నియంత్రణ చట్టాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా హెచ్–1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చింది డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉండి కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే అవకాశం భారీగా తగ్గిపోనుంది. 'ఎలిమినేటింగ్ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్' అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం ఫెడరల్ రిజిస్టరులో ప్రచురించనున్నారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉండి కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే అవకాశం భారీగా తగ్గిపోనుంది.
ప్రస్తుతం H-1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఈ సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించడంతో పాటు, కొత్త యజమాని ద్వారా వీసా స్పాన్సర్‌షిప్ ప్రక్రియను ప్రారంభించుకోవచ్చు. ఉద్యోగం దొరకకపోతే అమెరికా నుంచి వెళ్లేందుకు ఇల్లు, పిల్లల చదువులు, ఇతర వ్యక్తిగత వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు కూడా ఈ గడువు ఉపయోగపడుతుంది. ఈ 60 రోజుల వెసులుబాటు 2017 నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు ఎలిమినేటింగ్ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్' నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియక ముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E-1, E-2, E-3, H-1B, H-1B1, L-1, O-1, TN కేటగిరీల కింద ఉన్న నాన్-ఇమ్మిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది.
ఒబామా హయాంలో 2016లో ఈ గ్రేస్ పీరియడ్‌ను అమల్లోకి తెచ్చారు. ఉద్యోగులు సులభంగా ఉద్యోగం మారడానికి వీలుగా ఈ వెసులుబాటు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఉద్యోగం ముగిసిన తర్వాత ప్రస్తుతం లభిస్తున్న ఈ 60 రోజుల సమయం ఉండకపోవచ్చు. లేఆఫ్ లేదా ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు కొత్త ఉద్యోగం, వీసా స్పాన్సర్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులను కలవరపెడుతోంది. అమెరికా టెక్నాలజీ, ఐటీ, కన్సల్టింగ్ రంగాల్లో భారతీయ నిపుణుల సంఖ్య భారీగా ఉంది. పలు ఐటీ సంస్థలు H-1B వీసాలకు ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయే భారతీయ ప్రొఫెషనల్స్‌కు కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయం మరింత కీలకంగా మారనుంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చట్టబద్ధమైన వలసలను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా కఠిన చర్య ఇది.
మరోవైపు అమెరికాలోని రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవున్న విదేశీ డ్రైవర్ల మీద కఠిన ఆంక్షలు విధిస్తోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఇందులో భాగంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన ఓ పోస్టర్‌పై వివాదాస్పదంగా మారింది. దీనిపై సిక్కూ, హిందూ, పంజాబీ అమెరికన్ వలస దారుల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. పోస్టర్‌లో 'మిస్టర్ సింగ్' అంటూ చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘మా రోడ్డ మీద నుంచి తప్పుకోండి. మిస్టర్ సింగ్ నీకసలు వాహనం నడపడమే రాదు. స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లిపో. లేదంటే నిన్ను అరెస్ట్‌చేసి బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు వస్తారు’’అని ఆ వీడియోలో హెచ్చరించింది. 2014లో హాలీవుడ్‌లో హిట్ అయిన ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్‌టిన్షన్’కు పేరడీగా డ్రైవర్లను ట్రాన్స్‌ఫార్మర్లుగా పేర్కొంటూ కొత్త వీడియోకు ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్’ అని పేరు పెట్టి కొత్త వివాదం రేపింది.
అమెరికాలో గతంలో నిర్లక్ష్యంగా ట్రక్కులు నడిపి ప్రాణాలుపోయేందుకు కారణమైన డ్రైవర్లు హర్జీందర్ సింగ్, రాజీందర్ కుమార్, బెకాన్ బిషెకేవ్, జస్వీర్ సింగ్‌ల ఫొటోలను చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. దీనిపై భారతీయ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి అక్రమంగా అమెరికాకు రాలేదు. ప్రతి ఒక్క సిక్కు డ్రైవర్ రహదారులపై ప్రమాదాలు చేయట్లేడు. పనిగట్టుకుని సిక్కు వ్యక్తులను నేరస్తులుగా, దోషులుగా చూపిస్తూ యావత్ సిక్కులను, భారతీయులను కించపరుస్తున్నారు. ఇది ముమ్మాటికీ జాత్యహంకారమే’’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్, సిఖ్ కోలిషన్, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ‘‘అమెరికాలో లక్షలాది మంది సిక్కులు, హిందువుల పేర్ల చివర్లో సింగ్, కుమార్ అని ఉంటుంది. వాళ్లంతా రోడ్డుపై యాక్సిడెంట్లు చేస్తారన్నట్లు ఏఐ వీడియో రూపొందించడం చూస్తుంటే మమ్మల్ని శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా?’’అని సిఖ్ కోలీషన్ అసహనం వ్యక్తంచేసింది.
ఈ పోస్టు వివాదం ఏర్పడడంతో సంబంధిత అధికారులు వెంటనే తొలగించారు. వాస్తవానికి ఈ మొత్తం వివాదానికి కారణం 2025 ఆగస్టులో ఫ్లోరిడా టర్న్‌పైక్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హర్జిందర్ సింగ్ అనే డ్రైవర్ చేసిన రోడ్డు ప్రమాదం. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నాన్-డొమిసైల్డ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విదేశాల్లో జన్మించిన, అమెరికాలో శాశ్వత నివాసం లేని కొంతమంది కమర్షియల్ డ్రైవర్లతో సంబంధం ఉన్న ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది. కాగా 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాలో కొంతమంది సిక్కులను వారి తలపాగాలు, గడ్డం కారణంగా ముస్లింలుగా పొరపాటుగా భావించేవారు. అంతేకాదు, ఆ పొరపాటు కారణంగా సిక్కులు దాడులకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికన్ ప్రభుత్వమే ఇలా జాతి విద్వేషాలు రెచ్చ గొడితే ఎలా అనే చర్చ మొదలైంది.




