Burning Topic: యుద్ధం ముగుస్తోందా..? ఇరాన్ డిమాండ్లకు లొంగిన ట్రంప్..!
Burning Topic: అమెరికా మరియు ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చల పూర్తి వివరాలు. ఇరాన్ పెట్టిన షరతులేంటి?
Burning Topic: యుద్ధం ముగుస్తోందా..? ఇరాన్ డిమాండ్లకు లొంగిన ట్రంప్..!
Burning Topic: పశ్చిమాసియా పరిణామాలు గంట గంటకూ ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. శాంతిని సాధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెర పడింది. ఓవైపు చర్చలకు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేపట్టడంపై ఇరాన్ ఆగ్రహించడం తెలిసిందే. చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గతంగా విభేదాలు తలెత్తాయి. శాంతి చర్చలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవర్గం పట్టుబడుతుండగా, మరో వర్గం అందుకు ససేమిరా ఒప్పుకో లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే ఇస్లామాబాద్ చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అసలు చర్చలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. చివరకు ఇరాన్ ప్రతినిధి బృందం రావడంతో శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.
ఇరాన్ ప్రభుత్వానికి చెందిన రెండు విమానాలు ఇస్లామాబాద్‌లోని విమానాశ్రయంలో దిగాయి చర్చల్లో పాల్గొననున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ ఇతర పాక్ అధికారులు వీరికి స్వాగతం పలికారు. అయితే, ముందస్తు షరతులకు యూఎస్ అంగీకరిస్తేనే. చర్చలు ముందుకుసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఏ కాల్పుల విరమణ అయినా లెబనాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అమెరికా మీద తమకు నమ్మకం లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ తెలిపారు. గతంలో రెండుసార్లు చర్చలు జరుగుతుండగానే తమపై దాడికి పాల్పడ్డారన్నారు. తమ ప్రజల హక్కులను యూఎస్ గుర్తిస్తే.. వారితో ఒప్పందానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కాగా ఇస్లామాబాద్ చర్చల కోసం టెహ్రాన్ నుంచి బయలు దేరిన విమానంలో ఓ దృశ్యం ఉద్వేగపూరితంగా కనిపించింది. అమెరికా దాడుల్లో మృతి చెందిన చిన్నారుల చిత్రాలను ఒక్కో సీటులో ఉంచి.. ప్రపంచానికి సందేశం పంపారు. ఆ సీట్లలో రక్తంతో తడిసిన వారి బ్యాగులు, బూట్లు, కొన్ని పుష్పాలను ఉంచారు. వారి మృతికి నివాళిగా ఆ విమానానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్ నగరంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ స్థావరాలపై దాడి చేస్తున్న అమెరికాకు చెందిన తోమహక్ క్షిపణి ఓ పాఠశాలను తాకింది. ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఈ రూపంలో ప్రపంచానికి గుర్తు చేశారు ఇరాన్ ప్రతినిధులు. ‘‘ విమానంలో నా సహచరులు, మినాబ్ 168’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ రకంగా యుద్ధంలో తమకు జరిగిన నష్టాన్ని ప్రపంచానికి చాటారు. అని స్పీకర్ ఘాలిబఫ్ పోస్ట్ చేశారు
ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం తాజాగా ఇస్లామాబాద్ చేరుకుంది. ఈ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సి-32ఏ విమానంలో వీరు ప్రయణించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం ఇరాన్ గగనతలాన్ని తప్పించుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జేడీవాన్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే తాము యుద్ధాన్ని ముగించడానికి సహకరిస్తాం. కానీ తమను బురిడీ కొట్టించాలని చూస్తే మాత్రం కఠినంగా ఉంటాం" అని అన్నారు. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయెుద్దని హెచ్చరించారు. చర్చల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని వాన్స్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మరింత గట్టి దాడులే జరుపుతామని హెచ్చరించారు. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్‌పై దాడులకు రెడీగా ఉన్నాయన్నారు. ఈసారి మా యుధ్ధనౌకలను అత్యంత ఆధునిక ఆయుధాలతో నింపాం. ఒకవేళ ఒప్పందం గనుక కుదరకపోతే అత్యంత శక్తివంతంగా సైనిక చర్య ఉంటుంది. మరో 24 గంటల్లో ఏదనేది తేలిపోతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన. హర్మూజ్ నుంచి వెళ్లే నౌకలపై సుంకాలు విధించడానికి ఇరాన్ చేసే ఏ ప్రయత్నాన్నీ అమెరికా అనుమతించబోదని పేర్కొన్నారు. ఇరానియన్లకు ఎలాంటి అవకాశాలు లేవు. వారు ప్రపంచాన్ని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా కేవలం బెదిరించగలరు. ఇవాళ వాళ్లు ప్రాణాలతో ఉన్నారంటే అది కేవలం తన చర్చల వల్లే.. అని వ్యాఖ్యానించారు ట్రంప్
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి చర్చల కోసం వచ్చిన అత్యున్నత స్థాయి ప్రతినిధుల రక్షణ కోసం అధికారులు నగరాన్ని దాదాపుగా లాక్డౌన్ చేశారు. కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. ప్రధాన రహదారులను మూసివేసి, కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. వేల సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ దళాలను నగరవ్యాప్తంగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి, చర్చల సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా చర్చల కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. లెబనాన్‌ను కాల్పుల విరమణ పరిధిలోకి తేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో ఇస్లామాబాద్ చర్చలు తేడా కొడితే.. అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు అమెరికా-ఇరాన్‌ను శాంతి చర్చలకు ఒప్పించి రహస్యంగా క్రెడిట్ కొట్టేసిన చైనా.. డబుల్ గేమ్ ఆడుతోంది. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు అమెరికా గూఢచార సంస్థలు నివేదికలు ఇచ్చాయి. ఇరాన్ చమురు చైనాకు అవసరం కాబట్టే శాంతి చర్చల ద్వారా చమురు సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలనుకుంది. అలాగే అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ప్రపంచ శాంతి దూతగా తనను చూపించుకోవాలని.. తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నించింది. వీటన్నింటి కంటే హర్ముజ్ జలసంధి చైనాకు ఎంతో కీలకం.
ఇక పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ చర్చల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తెలిపారు. అయితే ఇరాన్‌తో వాషింగ్టన్ జరపుతున్న చర్చలు మాదిరిగానే కాల్పుల విరమణ లేదా ఒప్పందం కింద ఈ చర్చలు జరగాలని లెబనాన్ కోరుకుంటోందని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో సమావేశం కోసం ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు అమెరికాలోని లెబనాన్, ఇజ్రాయెల్ రాయబారులు ఫోన్లో మాట్లాడిన తర్వాత అధ్యక్షుడి కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అటు లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలు చేపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది, కానీ ఫోన్లో రాయబారులు చర్చల తర్వాత ఎలాంటి ప్రకటన ప్రకటన విడదుల చేయలేదు. ఈ పరిణామంపై హిజ్బుల్లా వర్గం స్పందించలేదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు అంగీకారం తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం తెలిసిందే.




