Burning Topic: మరింత ముదిరిన అమెరికా ఇరాన్ యుద్ధం!
Burning Topic: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా యుద్ధం తీవ్రతరమైంది. హర్మూజ్ జలసంధి కోసం అమెరికా సైనిక మోహరింపును 2027 వరకు పొడిగించనుంది.
Burning Topic: మరింత ముదిరిన అమెరికా ఇరాన్ యుద్ధం!
Burning Topic: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులను చిన్న సైనిక చర్యగా భావించినా.. ఇరాన్ నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటనతో యుద్ధంగా మలుపు తిరిగింది.
కొన్ని వారాల తాత్కాలిక విరామం తర్వాత సెప్టెంబర్ 2026 మొదటి వారంలో మళ్లీ తీవ్రరూపం దాల్చింది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరు దేశాలు పోటా పోటీగా దాడులు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం పశ్చిమాసియాలో తమ దళాల మోహరింపును 2027 వరకు పొడిగించాలని అమెరికా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 50,000 మంది సైనికులు, 19 యుద్ధ నౌకలు, ఫైటర్ స్క్వాడ్రన్లు, వైమానిక రక్షణ విభాగాలు, పారాట్రూపర్లు మొహరించి ఉన్నాయి. కాగా నవంబరులో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రిపబ్లికన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్ నాయకత్వాన్ని తిరిగి చర్చలకు తీసుకొచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి తంత్రం వైపు మొగ్గు చూపుతోంది. ఇరాన్‌పై తెస్తున్న ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల ఆ దేశం తన అణు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉందని, దాంతో యుద్ధం పూర్తయినట్లు ప్రకటించే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.
ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కట్టడి చేసేందుకు సైనిక, దౌత్య, ఆర్థిక చర్యలతో పాటు రహస్య ఆపరేషన్లు చేపట్టే అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టంచేశారు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర అనేక ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఉపయోగిస్తారు, మరికొన్నింటిని ఉపయోగించకపోవచ్చు.
అయితే, అందుబాటులో ఉన్న ప్రతి చర్యను పరిగణనలోకి తీసుకుంటాం. ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన ఒత్తిడి, రహస్య ఆపరేషన్లు చేపట్టే ఆప్షన్లు అధ్యక్షుడి వద్ద ఉన్నాయిఅని వాన్స్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగిసినట్లు ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా చేపట్టిన ఈ చర్య కేవలం వాణిజ్య నౌకాయానాన్ని రక్షించడం, ప్రపంచ ఇంధన సరఫరాలను కొనసాగించడం మాత్రమే కాదన్నారు. ఇరాన్ తన అణు సామర్థ్యాలను పునర్నిర్మించుకోకుండా నిరోధించడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన ఇరాన్ పరిణామాలను ఎదుర్కొనేలా అమెరికాకు సాయం చేసేందుకు గల్ఫ్ దేశాలతో సహా పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడకపోయినా, వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపినందుకు ఇరాన్ శిక్ష అనుభవించేలా మాకు సహాయపడటానికి ప్రైవేట్‌గా చాలా మంచి పనులు చేస్తున్నాయని వాన్స్ అన్నారు.
అమెరికా సైన్యం చేస్తున్న ప్రయత్నాలను వాన్స్ సమర్థించారు. ఇటీవల హర్మూజ్ సమీపంలో ఇరాన్ కొత్త రాడార్ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలపై అమెరికా భారీ గగనతల దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులు ప్రయోగించింది.
మరోవైపు ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్ పేరుతో చమురు, రవాణా, విమానయానం, డిజిటల్ ఆస్తుల ద్వారా ఇరాన్‌కు వచ్చే ఆదాయ మార్గాలను అమెరికా మూసివేసింది. మరోవైపు అమెరికా సైన్యానికి కొత్త కార్యదర్శిగా అడమ్ టెల్లేను నియమించారు డొనాల్డ్ ట్రంప్. టెల్లే 2025 ఆగస్టులో అమెరికా సెనేట్ ద్వారా నిర్ధారితమైన తర్వాత సివిల్ వర్క్స్ కోసం అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమాణం చేశారు.
ఆయన తన కెరీర్‌లో ఎక్కువ భాగం కాంగ్రెస్ సహాయకుడిగా పనిచేశారు.. రెండు రోజుల క్రితం వరకూ ఈ పదవిలో ఉన్న డాన్ డ్రిస్కోల్ రాజీనామా చేయడం తెలిసిందే. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌తో ఉన్న వివాదాల నేపథ్యంలోనే డ్రిస్కోల్ రాజీనామా చేశారనే ఆరోపణలున్నాయి.
మరోవైపు అమెరికాతో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇక నుంచి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసిన్ రెజాయ్ ఎక్స్ వేదికగా ఈ హెచ్చరికలు జారీ చేశారు.
'యుద్ధ క్షేత్రం, డిప్లొమసీ, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనే విషయాల్లో ఇరాన్ కొత్త వ్యూహం త్వరలోనే మీ పునాదులను కదిలిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా, మీరే సృష్టించుకున్న నరకం నుంచి బయటపడలేరు' అని అందులో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
తాజాగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డాయి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ దళాలు. జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కువైట్, బహ్రెయిన్, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ రీజియన్‌లో ఉన్న యూఎస్ బలగాలే లక్ష్యంగా డ్రోన్లు, మిసైళ్లతో దాడులు నిర్వహించాయి.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధి విషయంలో చేస్తున్న వ్యాఖ‌్యలను చిన్నపిల్లల ఆటగా కొట్టి పారేస్తోంది ఇరాన్. ‘హర్ముజ్ సీమైన్లను తొలగించి.. పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాం’ అని ట్రంప్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఇరాన్‌లో అమెరికా నిఘా ఎంత పక్కాగా ఉందో చెబుతూ.. ‘వాళ్లు బాత్రూమ్‌కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
అంతే కాదు హర్మూజ్ జలసంధికి తన పేరు కూడా పెట్టేసుకున్నారు ట్రంప్. దీంతో ఇరాన్ ఓ వీడియో గేమ్ రూపంలో ట్రంప్ మీద వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న యానిమేషన్‌లో హర్ముజ్ జలసంధి 3డీ మ్యాప్ కనిపిస్తుంది.
ఆ తర్వాత అది ‘మైన్‌స్వీపర్’ గేమ్‌లా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడున్నాయో గుర్తిస్తూ ఆడే ఈ గేమ్‌ను.. హర్ముజ్‌లోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్ ఈ వీడియో రూపొందించింది. దానితోపాటు ‘హబీబీ .. ఇరాన్‌కు రా!’ అంటూ సందేశం ఇచ్చింది.




