Off The Record: హస్తం పార్టీలో పదవుల వేట.. వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో ఉన్నదెవరు?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులతో పాటు మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ సాగుతోంది.
Off The Record: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని సంవత్సరంన్నర అవుతుంది. కానీ నేటికీ ఫుల్ టీమ్ రిక్యూర్మెంట్ జరగలేదు. ఇప్పటి వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకం మాత్రమే జరిగింది. పార్టీ కమిటిలో పీసీసీ సెక్రటరి, అధికార ప్రతినిధి పోస్టులు నింపాల్సి ఉంది.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహేష్ కుమార్ గౌడ్, జగ్గా రెడ్డి, గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్ లు ఉన్నారు. రాష్ట్రంలో హస్తం సర్కార్ ఏర్పాటుతో రేవంత్ సీఎంగా పగ్గాలు చేపట్టగా.. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. అదే టీమ్‌లోని మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం మంత్రిగా రేవంత్ కేబినెట్ లో ఉన్నారు. ఇక గీతారెడ్డి ఆరోగ్య పరిస్థితి రిత్యా యాక్టీవ్ గా లేరు. అంజన్ కుమార్ యాదవ్ సైతం పార్టీపై కొంత నిరాశతో ఉన్నారు. తూర్పు జగ్గారెడ్డి మాత్రం పొలిటికల్‌గా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీపై, గాంధీ కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ.. నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తూ అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నారు.
గత పీసీసీ కార్యవర్గంలో అయిదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లు ఉంటే.. ఈ సారి నూతన కార్యవర్గంలో నలుగురు సభ్యులకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే.. ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామజికవర్గం నుండి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటా నుండి నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాండిడేట్ ఫిరోజ్ ఖాన్, ఫయిమ్ ఖురేషి ,మహిళల నుండి సునీత ముదిరాజ్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తూర్పు జగ్గారెడ్డికి పార్టీ ప్రచార కమిటి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. రేవంత్ టీమ్‌లో ఇంకా రెండు కేబినెట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వాటి భర్తీకి ఎప్పటి నుంచో తర్జన భర్జన జరుగుతున్నా..ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం కాస్త వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది.
అందరిని మెప్పించి.. సయోధ్యతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఐతే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం త్వరలోనే సీఎం రేవంత్ హస్తిన పర్యటనకు వెళ్లనున్నట్టు.. ఆ టూర్‌తో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ST సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేకపోవడంతో.. ఆయా లీడర్లలో ఒకరికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. కేబినెట్లోకి కొత్తగా ఇద్దరికి చోటుతో పాటు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలనూ మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే ఒక బీసీ మంత్రికి ఉధ్వాసన పలికి.. ఆ స్థానంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు అవకాశం కల్పిస్తారని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అలాందేమీ లేదని, పీసీసీ చీఫ్ పోస్టుతో తాను సంతృప్తిగానే ఉన్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ముందు రెండు టాస్క్‌లు ఉన్నాయి. అందులో ఒకటి.. మంత్రివర్గ విస్తరణ.. ఇంకోటి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం. మరి ఎవరికి ఏ రోల్ అప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎక్కువ రోజులు నాన్చకుండా.. త్వరగా తేల్చాలని రాష్ట్రంలోని లీడర్లు, కేడర్ కోరుకుంటోంది. చూడాలి మరి హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండనుందో.




