Burning Topic: దీదీ కు దెబ్బ మీద దెబ్బ.. బీజేపీ గెలవడం ఖాయం?
Burning Topic: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలకు ముందే మమతా బెనర్జీకి షాక్! కౌంటింగ్ సిబ్బంది నియామకంపై టీఎంసీ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు.
Burning Topic: దీదీ కు దెబ్బ మీద దెబ్బ.. బీజేపీ గెలవడం ఖాయం?
Burning Topic: పశ్చిమ బెంగాల్లో ఓవైపు పోలింగ్ పూర్తయి, ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తన పోరాటాన్ని ఆపడం లేదు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తాజాగా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ సవాలు చేసింది. ఈ అంశంపై మమత పార్టీ తొలుత కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని న్యాయస్థానం కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ మమత పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించారంటూ ఎన్నికల సంఘం మీద టీఎంసీ ఆరోపణలకు దిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది.
టీఎంసీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా కౌంటింగ్ విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మిశ్రమంగా కౌంటింగ్ సిబ్బంది ఉంటారని ఏప్రిల్ 13 నాటి సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈసీ.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. రిటర్నింగ్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటారని, కౌంటింగ్ సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమని వాదించింది. ఆ సర్క్యులర్‌ను తుచ తప్పకుండా అమలుచేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.టీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఆ సర్క్యులర్ గురించి తమకు ఏప్రిల్ 29న తెలిసిందన్నారు. అందులో ఉన్నదిఉన్నట్లుగా అమలు చేయాలన్నారు ఈ క్రమంలోనే జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ స్పందిస్తూ.. ఆ సర్క్యులర్ అమలు కావాలని ఆశిస్తున్నట్లయితే.. అసలు కోర్టు ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయస్థానం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పిటిషన్‌ను తప్పుపట్టింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై టీఎంసీ అభ్యంతరాలను తిరస్కరించింది. మైక్రో అబ్జర్వర్లు ఎంపిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కోర్టు పూర్తిగా సమర్థించింది. ‘‘రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పని చేస్తారు. వారికి ఎలాంటి విధేయతలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంలో తప్పేముంది?. ఆ ఎంపికలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఈసీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయం చేయడం తగదు.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోబోమంటు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా బెంగాల్లో గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకాగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు. అయితే రెండో విడత పోలింగ్ తర్వాత అధికార టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ధర్నాకు దిగింది. తాను పోటీ చేస్తున్న భవానీపుర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర మమతా బెనర్జీ స్వయంగా ఆందోళన చేపట్టారు. అయితే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవకతవకలకు అవకాశం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
కాగా మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ నాయకుడు, విపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. ఇదంతా మమతా బెనర్జీ చేస్తున్న రాజకీయ డ్రామా మాత్రమేనని విమర్శించారు. ప్రచారం కోసం టీఎంసీ ఎత్తుగడగని, వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వాళ్లు రాజకీయాలను వృత్తిగా మార్చుకున్నారు. అధికారంలో లేకపోతే పూర్తిగా కూలిపోతార అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు మేము గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు సువేందు అధికారి. తృణమూల్ పార్టీ ఓటమి ఖాయమని తెలిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ బూత్‌లలో బీజేపీ ఎన్నికల గుర్తును టేప్‌తో కప్పివేశారని ఆరోపించారు. మరోవైపు
పశ్చిమ బెంగాల్‌లోని మగర్హాట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ శాసనసభ నియోజకవర్గాల్లో 15 చోట్ల రీపోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం
పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ శాతం నమోదు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు దశల ఎన్నికల్లోనూ పోలింగ్ ఏకంగా 92 శాతం దాటడం విశేషం. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు రావడం అనేది బహుశా అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ప్రబల సంకేతం కావచ్చని, లేదా ఓటర్ల ఆలోచనా విధానంలో వస్తున్న పెను మార్పులకు ఒక ప్రత్యక్ష నిదర్శనం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అసాధారణ స్థాయిలో బలపడి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సవాలు విసురుతోంది.మే 4న వెలువడనున్న ఫలితాల కోసం బెంగాల్‌తో పాటు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.




