Burning Topic: సినిమా నుంచి సీఎం వరకు
Burning Topic: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం! ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ చేసిన తొలి సంతకం దేనిపై?
Burning Topic: సినిమా నుంచి సీఎం వరకు
Burning Topic: విజయ్ ప్రభుత్వం ఏర్పాటుతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అనూహ్య విజయం సాధించినప్పటికీ కనీస మెజారిటీకి కొద్ది రూరంలో ఉండటంతో విజయ్ నెంబర్ గేమ్‌లో తడబడి లోక్ భవన్ చుట్టూ తిరగక తప్పలేదు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ముస్లింలీగ్ పార్టీలు మద్దతు లేఖలు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. . వీరందరి సమక్షంలో జోసెఫ్ విజయ్‌తో తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ. సెంగోటియన్, ఎస్ కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు మంత్రులుగా ప్రమాణం చేశారు
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైల్‌పై తొలి పంతకం చేశారు. ఆ తర్వాత యాంటీ డ్రగ్ టాస్క్‌ఫోర్స్ , మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రాలపై సంతకాలు పెట్టారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ప్రసంగం అభిమానులను ఉర్రూతలూగించింది. విజయ్ ప్రభుత్వ సొమ్ములో ఒక్క పైసా కూడా తినడు. తప్పు చేయను. నా చుట్టూ ఉన్నవాళ్లనీ చేయనివ్వను. గెలిచాం కదా.. ఓ ఆట ఆడేద్దాం అన్న ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే దాన్ని ఇప్పుడే ఎరేజ్ చేయండి. మిత్రులైనా.. శత్రువులైనా.. అందరికీ తమ ప్రభుత్వంలో ఒకే చట్టం. విద్యార్థుల కోసం విజయ్ మామ అన్నీ మంచి పనులే చేస్తాడు’’ అంటూ సాగింది విజయ్ ప్రసంగం.. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లింది.. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి అని కోరారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. సాధ్యమయ్యేవే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ఎంతటి అసాధ్యాలనైనా సాధించే విశ్వాసం నాకుంది అని తెలిపారు.
విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్షణాన్ని తాను ఎంతగానో ఆస్వాధించానని తెలిపారు విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్.. "నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుమారుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూసి నేను ఆనందించానని తెలిపారు. విజయ్ తల్లి శోభ కూడా సంతోషం వ్యక్తం చేశారు. "నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మాతృ దినోత్సవం కూడా కావడంతో నా ఆనందానికి అవధులు లేవు" అని అన్నారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మొత్తానికి హీరోయిన్ త్రిష హైలెట్‌గా నిలిచింది.
నీలం రంగు సిల్క్ చీరలో మల్లెపూలతో పాటు డైమండ్ ఆభరణాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడుకు ఇదో గొప్ప రోజని అన్నారు. అంతకు ముందు మే 4న ఫలితాల సమయంలోనూ నటి త్రిష సందడి చేశారు. టీవీకే గెలుపు దిశగా దూసుకుపోతున్న సమయంలో నటి త్రిష విజయ్ ఇంటికి చేరుకున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తాజాగా తమిళగ వెట్రి కళగం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య శక్తిగా ఎదిగారు. ఈ పయనం వెనుక ఎంతో కృషి ఉంది.
విజయ్ సినీదర్శకుడు చంద్రశేఖర్, శోభా దంపతులకు 1974 జూన్ 22న చెన్నైలో జోసెఫ్ విజయ్ జన్మించారు. 1980ల్లోనే బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో చేరాక సినిమా అవకాశాలు రావడంతో విద్యాభ్యాసం ఆపేశారు. 1992లో తండ్రి దర్శకత్వం వహించిన 'నాలైయ తీర్పు' సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. 34 ఏళ్ల సినీ ప్రయాణంలో 70 సినిమాల్లో నటించి అనేక రికార్డులు నెలకొల్పారు. 2009లోనే విజయ్ మక్కల్ ఇయక్కం-VMI పేరిట ఫ్యాన్ క్లబ్‌లు ఏర్పాటు చేసి సామాజిక సేవా చేయడం ప్రారంభించారు. వీఎంఐ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి మద్దతిచ్చింది. 2020లో ఈ వీఎంఐని విజయ్ తండ్రి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే, దీన్ని విజయ్ నాడు బహిరంగంగానే వ్యతిరేకించారు.
విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా సుమారు 100 మందికి గాయాలయ్యాయి. ఈ వ్యవహారం సీబీఐ దర్యాప్తునకు దారితీసింది. కరూర్ ఘటన తర్వాత విజయ్ ర్యాలీలపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా సభలు, రోడ్ షోలతో ప్రచారంలో దూసుకుపోయారు. విజయ్ చివరి సినిమా జననాయగన్‌కు కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. సెన్సార్ అనుమతి రాక అనేకసార్లు వాయిదా పడింది. విడుదలకు ముందే సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవైవాహిక జీవితంలోనూ భార్యతో తలెత్తిన విభేదాలు.. విడాకులకు దారి తీశాయి. ప్రస్తుతం విజయ్ దంపతుల విడాకుల కేసు విచారణ దశలో ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయని విజయ్ తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు.
విజయ్ రాజకీయ రంగప్రవేశం అనేది అనుకోకుండా జరిగింది కాదు. దీని కోసం గత ఐదేళ్లుగా ఒక పక్కా ప్రణాళికతో పనిచేసిందన్నది టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో డీఎంకే, అన్నాడీఎంకే రెండు కూటములూ టీవీకేను తేలిగ్గా తీసుకున్నాయి.. పోటీ తమ రెండు కూటముల మధ్యే అని భావించాయి. అయితే యువత, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు పెద్దఎత్తున టీవీకేకు మద్దతుగా నిలిచారు. యువత, మహిళలు, వారి సాధికారత, ఉపాధి అవకాశాలతో రూపొందించిన విజయ పార్టీ మ్యానిఫెస్టో అన్ని వర్గాలపై ప్రభావం చూపింది. పెళ్లయ్యే యువతులకు 8గ్రాముల బంగారం, సిల్క్‌చీరలు అందించే పథకం, మహిళలకు నెలానెలా రూ.2,500 సాయం లాంటి హామీలు ఓట్ల వర్షం కురిపించాయి. రేషన్ దుకాణాల్లో, పాఠశాలలు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా ఇస్తామన్నారు. కుటుంబాలకు ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 29 ఏళ్లు దాటిన నిరుద్యోగులకు భృతి ఇస్తాననడం లాంటివి గెలిపించాయి.




