Off The Record: కాంగ్రెస్‌లో రేవంత్ హవా!
Off The Record:కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుండి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేశారు కాంగ్రెస్‌లో కలకలం రేపిన ఈ పరిణామంపై విశ్లేషణ
Off The Record: కాంగ్రెస్‌లో రేవంత్ హవా!
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర వివాదానికి దారితీసిన పరిణామాల మధ్య అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రితోపాటు ఇతర కాంగ్రెస్ నేతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
కాంగ్రెస్‌తోపాటు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి సీనియర్ నేతలపై అయినా కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలు ఇచ్చారు పార్టీ పెద్దలు, రేవంత్ రెడ్డి. ఇదే క్రమంలో ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిన్నారెడ్డిని కూడా తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు.
కొండా సురేఖ తొలగింపుతో తలెత్తిన అసంతృప్తిని చల్లబరిచేందుకు, అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం వెంటనే పలువురు మహిళా నేతలకు కీలక పదవులు కేటాయించింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ..
కుడా చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని వెంటనే నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఫలితంగా బీసీ, మహిళలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపించకుండా డ్యామేజీ కంట్రోల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కనీస సమాచారం ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా తనను తొలగించడం అన్యాయమని కొండా సురేఖ మండిపడ్డారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ఆమె ఎదురుదాడి చేశారు.
తాను వెనుకబడిన తరగతి మహిళ కావడమే ఈ వివక్షకు కారణమని, మంత్రివర్గంలో ఇతర వర్గాల నేతలపై ఆరోపణలు ఉన్నా చర్యలు ఎందుకు లేవని సురేఖ ప్రశ్నించారు. ఈ చర్యతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్.. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలకారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఖండించడంలో మంత్రి విఫలం కావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సురేఖ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం మీడియా వేదికగా సీఎంపై తిరుగుబాటు ధ్వజం ఎత్తారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్ పెద్దలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో వరుస భేటీలు జరిపి, పార్టీ లైన్ దాటిన సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.
సురేఖ బీసీ మహిళా కార్డ్ ప్రయోగించినప్పటికీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉదాసీనంగా వదిలేస్తే ప్రభుత్వంపై సీఎం పట్టు కోల్పోతారనే ఉద్దేశంతో అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకే మొగ్గు చూపింది. కాంగ్రెస్ హైకమాండ్ గురువారం సాయంత్రంలోగా రాజీనామా చేయాలని సురేఖకు అల్టిమేటం ఇచ్చింది.
అయితే "నేను తప్పు చేయలేదు, రాజీనామా చేయను" అని ఆమె భీష్మించుకోవడంతో, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా గవర్నర్‌కు బర్తరఫ్ లేఖ పంపి ఆమెను పదవి నుంచి తొలగించారు. ఈ బర్తరఫ్‌తో రేవంత్ రెడ్డి.. తన నాయకత్వాన్ని ధిక్కరించే వారికి పార్టీలో స్థానం లేదనే స్పష్టమైన సందేశాన్ని పంపినట్లయింది.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని కాంగ్రెస్ సాధారణ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి వర్గం స్వాగతించారు. రాఖీ పౌర్ణమి వేళ సీఎం రేవంత్‌కు కొండ సురేఖ ప్రత్యేకంగా బంగారు రాఖీ తయారు చేయించి కట్టినప్పటికీ..
ఆ సెంటిమెంట్ ఏమాత్రం తనకు ఫలించలేదన్న సెటైర్లు షికారు చేస్తున్నాయి. బయటకు చిరునవ్వుతో రాఖీ కట్టించుకున్నప్పటికీ.. కొండా సురేఖపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ విచారణ, AICC పరిణామాలు లోలోపల కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమంటున్నారు.
రాఖీ కట్టించుకున్నంత మాత్రాన తప్పులు క్షమించబడతాయా అంటే తాజా ఉదంతంతో లేదనే చెప్పాలి. తనపై ఎదురుతిరిగితే ఎంతటివారైనా చర్యలు తీసుకోకతప్పదనే బలమైన సంకేతాలను రేవంత్ రెడ్డి ఇచ్చారన్న టాక్ కూడా రీసౌండ్ చేస్తోంది.




