Off The Record: 22-ఏ పై దీక్షకు సిద్ధమైన బీజేపీ నేతలు!
Off The Record: తెలంగాణలో 22ఏ భూముల వివాదంపై బీజేపీ పోరుబాట. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష. ఫీజు బకాయిలపై మహాధర్నాకు సన్నాహాలు.
Off The Record: 22-ఏ పై దీక్షకు సిద్ధమైన బీజేపీ నేతలు!
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో మరో అంశం వేడెక్కుతోంది. అదే 22ఏ భూముల వ్యవహారం. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై బీజేపీ భగ్గుమంటోంది.
తమ భూమి తమ చేతిలో ఉన్నా.. రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తోంది. "భూమి రైతుది... నిర్ణయం సర్కార్‌దా?" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. భూ భారతి అమలుతో భూ యజమానులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నది బీజేపీ బలమైన ఆరోపణ.
ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెండు రోజుల పాటు దీక్ష చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. ఇప్పుడు 22ఏ సమస్యను పట్టుకుని మరోసారి ప్రభుత్వంపై యుద్ధానికి సై అంటోంది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వేదికగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షకు సర్వం సిద్ధం చేసింది.
22-A నిబంధనలను ఉపసంహరించాలన్న డిమాండ్‌తో బీజేపీ పోరుబాట పట్టబోతోంది. మరి ప్రభుత్వం తగ్గుతుందా..? లేక “మేమెందుకు తగ్గాలి..?”అంటూ ఎదురుదాడికి దిగుతుందా..? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.
22ఏ బాధితులను ఒక్కచోటికి చేర్చి... సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారట. మరి 22ఏ పేరుతో రైతుల ఆవేదనను బీజేపీ రాజకీయ ఆయుధంగా మల్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందంటున్నారు. బీజేపీ దీక్షతో సరిపెట్టుకోవడం లేదట. సెప్టెంబర్ 7న బీజేవైఎం అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద భారీ మహాధర్నాకు సిద్ధమవుతోందట. దాదాపు 15 వేల కోట్లు, 40 లక్షల మంది విద్యార్థుల అరిగోస, ఆవేదనకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో యువమోర్చా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతోందట. దాన్ని తర్వాత రోజు రైతు సమస్యలపై కిసాన్ మోర్చా రంగంలోకి దిగే అవకాశం ఉందట. రైతు భరోసా, ఫసల్ బీమా.. రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయ రంగ సమస్యలు.. అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
అంటే... విద్యార్థుల సమస్యతో యువతను.. 22-Aతో భూ, ఇండ్ల యజమానులను, రైతు సమస్యలతో రైతాంగాన్ని.. ఒక్కో వర్గాన్ని ఒక్కో ఇష్యూతో కలుపుకునే ప్రయత్నంగా కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోందట.
దీంతో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు బీజేపీ ప్లాన్ చేస్తోందట. అటు విద్యార్థులు, ఇటు రైతుల సమస్యలను కలిపి కాంగ్రెస్‌పై రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నంగా బీజేపీ పావులు కదుపుతోందట.
ఇక అసెంబ్లీ సమావేశాలు మొదలైతే 22ఏ అంశంపై అసలు రాజకీయ యుద్ధం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రోడ్డుపై ఆందోళన ఒకవైపు.. అసెంబ్లీలో అస్త్రాలు మరోవైపు. అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ అంశాన్ని గట్టిగా లేవనెత్తాలని బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారట.
ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చాయి..? బాధితుల సమస్యలకు పరిష్కారం ఏంటి..? భూ భారతి అమలులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై ప్రభుత్వం ఏం చెబుతుంది..? ఇలాంటి ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోందట.
ఒకవైపు అసెంబ్లీలో ప్రశ్నలు.. మరోవైపు రోడ్డుపై నిరసనలు. ఒకవైపు దీక్ష.. మరోవైపు ధర్నా.. అంటే.. బయట నుంచి ఒత్తిడి.. లోపల నుంచి ప్రశ్నలు. ఇది సాధారణ ఆందోళనా..? లేక కాంగ్రెస్ ప్రభుత్వంపై “పొలిటికల్ ప్రెజర్ గేమ్ పెట్టే వ్యూహంతో అడుగులు వేస్తోందా..?. మరి ప్రభుత్వం ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోబోతోంది..? 22-Aపై వెనక్కి తగ్గుతుందా..? లేక బీజేపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.




