Off The Record: అధిష్టానానికి చేరిన కర్నూలు టీడీపీ ఎమ్మెల్యేల జాతకం..!

Off The Record: టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. సొంత ఎమ్మెల్యేల తీరుపై అధిష్టానానికి ఇచ్చిన రిపోర్ట్ పూర్తి వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2026 8:56 AM IST
Off The Record
X

Off The Record: అధిష్టానానికి చేరిన కర్నూలు టీడీపీ ఎమ్మెల్యేల జాతకం..!

Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ మునుపెన్నడు లేని విధంగా అత్యధిక సీట్లను గెలుచుకుంది. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలతో కలిసి.. 11 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో బిజెపి ఒక స్థానంలో గెలుపొందింది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో టిడిపి పూర్తి జోష్‌తో పనిచేస్తూ వెళ్తోంది.

అధికారంలోకి వచ్చాక ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఇది నాణానికి ఒకవైపే అన్నట్లు కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధిష్టానానికి ఒక లేఖ రాశారని, ఆ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ లేఖ ద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, బిజెపి ఎమ్మెల్యే జాతకాన్ని బట్టబయలు చేశారట. కూటమి పవర్‌లోకి వచ్చాక మాహిళా నేతలకు ప్రాధాన్యతనిస్తూ.. పార్టీ సీనియర్ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది అధిష్టానం.

జిల్లాలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీల పనితీరుపై టీడీపీ అధిష్టానానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఐతే తాజాగా హైకమాండ్‌కు పంపిన లేఖలో పలువురు లీడర్ల పర్ఫామెన్స్ బాగులేదు అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారట. కర్నూలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారట.

పార్టీ కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారని, సొంతవారికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పని చేస్తున్న వారిని విస్మరిస్తున్నారని అధిష్టానానికి పంపిన రిపోర్టులో పేర్కొన్నారట. జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సొంత ప్రయోజనాలు తప్ప పార్టీ కోసం పని చేసిన నాయకులను పట్టించుకోవడంలేదని,

దీని ద్వారా పార్టీ దెబ్బ తినే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులను కలుపుకొని పోవడంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని అనేక సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన నాయకులు అవమానాలకు గురవుతున్నారని చాలా డీటెయిల్ గా లేఖలో పొందుపరిచారట.

జిల్లా మంత్రి నుంచి నియోజకవర్గ ఇన్చార్జి వరకు ఎవరిని విడిచిపెట్టకుండా ఏడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందనేది క్లియర్ గా పేర్లతో సహా ఆమె ఆ లెటర్లో రాశారట. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పార్టీ కోసం పని చేసిన వారిని దూరం పెట్టి..

నచ్చినవారికి పదవులు ఇచ్చారని, సీనియర్లను దూరం పెట్టారని, ఎమ్మెల్యేల అధిపత్యంలో పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారని క్లియర్ గా రాసుకొచ్చారట. అయితే ఈ రిపోర్ట్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి చేరకముందే కర్నూలు జిల్లా టిడిపి నాయకులకు చేరడంతో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇటీవల పత్తికొండ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఆ సమావేశంలో అందరూ గుడిసె కృష్ణమ్మపై తీరస్థాయిలో మండిపడినట్టుగా తెలుస్తుంది. ఐతే తాను రాసిన లేఖ బయటికి ఎలా వచ్చిందనే దానిపై అధ్యక్షురాలు విచారించగా పార్టీ ఆఫీసు నుంచే తన లెటర్ లీక్ అయినట్లు తెలుసుకున్నారట.

టిడిపి అధ్యక్షురాలు మాత్రం ఆ లేఖ తాను రాసినట్లు ఒప్పుకోకపోయినా అధిష్టానానికి మాత్రం ఆమె లెటర్ హెడ్ పైనే లేఖ వెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా లేఖలోని సారాంశం చూస్తే నియోజకవర్గ వ్యవహారాల గురించి..ఆమె క్లియర్ గానే రాశారని ఇందులో ఎలాంటి అపోహలు లేవని సొంత టిడిపి నాయకులు చెబుతున్న పరిస్థితి.

పార్టీ అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేస్తే అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు తమ వారిని ప్రోత్సహించి పార్టీ కోసం పనిచేసిన నాయకులను దూరం పెట్టడం సమంజసం కాదని పేరుకు అధికారంలో ఉన్నా తమకు న్యాయం జరగలేదన్న బాధతో ఉన్నామని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్న పరిస్థితి.

అధ్యక్షురాలి లేఖాస్త్రం ఎమ్మెల్యేలపై ఎంతవరకు పనిచేస్తుందో, పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్లమెంట్‌ పరిధిలోని టిడిపి నాయకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జిల్లా అధ్యక్షురాలు రాసిన లేఖ నేతల మధ్య సమన్వయం ఎంతవరకు ఉందో చెబుతున్నాయి.

ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోకపోతే నియోజకవర్గాల్లో టిడిపి దెబ్బతినే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story