Off The Record: కర్నూలు కూటమిలో భగ్గుమంటున్న విభేదాలు.. పదవులన్ని వాళ్లకేనా?
Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. నామినేటెడ్ పదవుల కేటాయింపులో టీడీపీ ఆధిపత్యంపై జనసేన, బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Off The Record: కర్నూలు కూటమిలో భగ్గుమంటున్న విభేదాలు.. పదవులన్ని వాళ్లకేనా?
Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు గెలిచింది. మొత్తం 11 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. మొదటి సారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీజేపీ సైతం.. ఎమ్మెల్యే స్థానంపై జెండా ఎగరేసింది. ఈ భారీ విజయంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించి కూటమి గెలుపు కోసం పాటుపడ్డారు. విబేధాలు ఉన్నప్పటికీ అధికారంలోకి రావాలనే కసితో అవమానాలు, బెదిరింపులు ఎన్ని ఉన్నా అధినేత చెప్పారనే మాట కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు. అధికారం రాకముందే కొన్ని నియోజవర్గాల్లో కూటమి నాయకులు మధ్య గ్యాప్ ఉండేది.
అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలు టిడిపి నాయకులు గెలవడంతో వారు చెప్పిందే వేదం అయ్యింది. ఆదోనిలో బీజేపీ చెప్పిందే ఫైనల్. ఇలా 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చెప్పే మాటలకు, చేసే పనికి సంబంధం లేకుండా ఉందట. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ పోస్టుల కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ జరిగింది. అత్యధిక చైర్మెన్, డైరెక్టర్, ఆలయ పోస్టులు టీడీపీకి చెందిన నాయకులకే ఇచ్చుకున్నారన వాదన ఉంది. నామ మాత్రంగా జనసేన, బీజేపీ నాయకులకు సీట్లు కేటాయించారన్న అభిప్రాయం ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దీంతో బీజేపీ, జనసేన పార్టీ లీడర్లు... జిల్లాలో జరుగుతున్న విషయాలను తమ పార్టీ అధినేతల దృష్టికి తీసుకెళ్లారు.
కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీని ఉమ్మడి జిల్లాలో టీడీపీ పక్కన పెట్టిందన్న ఆరోపణలపై సైకిల్ పార్టీ అధినాయకత్వం స్పందించింది. దీంతో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ పదవిని బీజేపీకి, ఆళ్లగడ్డ మార్కెట్ ఛైర్మెన్ పదవి జనసేనకు కేటాయించారు చంద్రబాబు. ఈ రెండు చైర్మన్ పదవుల కోసం టీడీపీలోనే పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు,లోకేష్ పై ఒత్తిడి తెచ్చారు. వారి ప్రతిపాదనలను పక్కన పెట్టి ఆలయ పదవిని కడప బీజేపీకి చెందిన రమేష్ నాయుడుకు కేటాయించారు. ఆళ్లగడ్డ మార్కెట్ ఛైర్మెన్ పదవిని జనసేనకు చెందిన మహిళా నాయకురాలికి కేటాయించారు. ఐతే ఛైర్మన్ పదవి తమకు వచ్చిందనే మాటే తప్ప ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం జరుగలేదు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే.. మార్కెట్ కమిటీకి సంబంధించిన మిగతా డైరెక్టర్ల పేర్లు ఇవ్వకపోవడమేట. తమను సంప్రదించకుండా జనసేన పార్టీకి ఏ విధంగా చైర్మెన్ పదవి ఇస్తారని, పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కూటమి సమీకరణలు చెపితే పదవి వదులుకోబోమని, తనను కాదని చైర్మన్ ఎలా అవుతారో అని ఎమ్మెల్యే భీష్మించుకొని ఉన్నారట. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఎమ్మిగనూరులో టీడీపీ vs బీజేపీ అన్నట్లు మారింది. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందవరం మండలంలో జెండావిష్కరణకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ నాయకులు నిర్మాణం మొదలు పెట్టగానే టీడీపీ నాయకులు ఆ పనులను అడ్డుకున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంబో పోలీసులు పనులను నిలుపుదల చేయడంతో... బీజేపీ నాయకులు అక్కడే నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తమను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అంతు చూస్తామని బెదిరించారని, పోలీసులు కూడా టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఇదంతా జరుగుతుందా అని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమిలో ఉన్న తమనే ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో జిల్లాలో.. కూటమి నాయకులు ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాము మిగతా పార్టీల నాయకులకు సపోర్ట్ చేస్తే సొంత పార్టీ నుంచి ఇబ్బంది ఎదుర్కొంటామని టీడీపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారట. ఇటు బిజెపి, జనసేన మాత్రం మొదటి నుంచి టిడిపి తమను చిన్నచూపు చూస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే కార్పొరేషన్, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని కూటమి నాయకులు చెపుతున్న పరిస్థితి కనిపిస్తోంది..మరి మూడు పార్టీల అధినాయకులు ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చక్కబెడతారో లేదో చూడాలి.


