Burning Topic: అన్నాడీఎంకేలో ముసలం: ముక్కలవుతున్న ఎంజీఆర్, జయలలిత వారసత్వం!
Burning Topic: తమిళనాడులో విజయ్ ప్రభంజనం. టీవీకే (TVK) పార్టీ విజయంతో కొత్త ప్రభుత్వం.
Burning Topic: అన్నాడీఎంకేలో ముసలం: ముక్కలవుతున్న ఎంజీఆర్, జయలలిత వారసత్వం!
Burning Topic: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయాలను ఊహించని మలుపులు తిప్పుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని వంతుల వారీగా పాలిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకేలకు షాక్ ఇస్తూ తీర్పు ఇచ్చారు తమిళ ఓటర్లు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకి ఆధిక్యత రావడంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీఎస్కే, ముస్లింలీగ్ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో అన్నాడీఎంకేలో ముసలం పుట్టింది. అంతర్గత తిరుగుబాట్లు ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పార్టీ సీనియర్ నేతలు సీవీ షణ్ముగం సారథ్యం, ఎస్పీ వేలుమణి నాయకత్వలో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు ఓటు వేశారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించారు పళనిస్వామి. అయితే అసలైన అన్నాడీఎంకే తమదేనని వారు ప్రకటించడంతో పార్టీలో చీలక స్పష్టమైపోయింది.
తమిళనాడు చరిత్రను గమనిస్తే ద్రవిడ రాజకీయాలదే ఇక్కడ పెత్తనం. అన్నాదురై నేతృత్వంలో 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ - డీఎంకే ఆవిర్భవించిన కొద్ది కాలం నుంచే చీలిక పర్వం ప్రారంభమైంది. అన్నాదురై తర్వాత పార్టీకి నాయకునిగా, ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధితో విబేధించారు ఆ పార్టీలోని అగ్రనటుడు ఎంజీ రామచంద్రన్. డీఎంకే ఆయన్ని బహిష్కరించడంతో 1972లో ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం - ఏఐఏడీఎంకేను ప్రారంభించారు. ఈ పార్టీ 1977లో అధికారం చేపట్టింది. ఎంజీఆర్ 1987లో మరణించే వరకూ ఏకంగా 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎంజీఆర్ మరణంతో ఆయన భార్య జానకీ రామచంద్రన్, పార్టీలోని ప్రముఖ నటి జయలలిత మధ్య తలెత్తిన విభేదాలు అన్నాడీఎంకే చీలికకు దారి తీసింది. 1989 ఎన్నికలలో జయలలిత వర్గం 27 సీట్లు గెలవగా.. జానకి వర్గం 1 సీటుకే పరిమితమైంది. అన్నాడీఎంకేపై జయలలిత పట్టు స్పష్టం కావడంతో జానకీ రామచంద్రన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
అన్నా డీఎంకేకు తిరుగులేని నాయకురాలిగా ఆవిర్భించిన జయలలిత దాదాపు తమిళనాడుకు 6 సార్లు ముఖ్యమంత్రిగా.. దాదాపు 14 సంవత్సరాలకు పైగా పాలించారు. ఆమెతో విబేధించిన కొందరు నాయకులు పార్టీని వీడాల్సి వచ్చింది. 1990లో పార్టీ సీనియర్ నేత తిరునావుక్కరసును బహిష్కరించడంతో ఆయన ‘ఎంజీఆర్ ఏడీఎంకే’ను స్థాపించారు. 1995లో ఆర్ఎం వీరప్పన్ అన్నాడీఎంతో విడిపోయి ‘ఎంజీఆర్ కళగం’ఏర్పాటు చేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పూర్తిగా జయలలిత వశమైంది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సీనియర్ నేత పన్నీరు సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిని చేశారు. అయినప్పటికీ అన్నాడీఎంకేపై జయలలిత పట్టుకొనసాగింది. 2016తో జయలలిత మరణంతో పన్నీరు సెల్వం ఆమె మరణంతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
జయలలిత మరణానంతర పరిణామాలతో 2017 ఫిబ్రవరిలో ఆమె ఆప్త స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా.. పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా పళణిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శశికళకు వ్యతిరేకంగా 2017 ఆగస్టులో సీఎం పళణిస్వామి, పన్నీరు సెల్వం ఏకమయ్యారు. శశికళ ప్రతినిధి దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఆయన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక తప్పలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కోసం ఇయక్కం పేరిట శిబిరంతో రాజకీయాన్ని సాగించారు.
2022–23 మధ్యకాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పళణి స్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి పరాజయం ఎదురైంది. ఇదే వరుసలో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, ఉప ఎన్నికలలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. జైలు నుంచి విడుదలై వచ్చిన శశికళ తిరిగి అన్నాడీఎంకేలో క్రియాశీలం అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే పన్నీర్ సెల్వం అందుకు అవకాశం ఇవ్వలేందు. దీంతో ఆమె 2026 ఫిబ్రవరిలో ఆల్ ఇండియా పురచ్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం పేరుతో మరో పార్టీని స్థాపించారు. అన్నాడీఎంకేకు దూరమైన పన్నీర్ సెల్వం తన రాజకీయ ఉనికి కోసం డీఎంకేలో చేరక తప్పలేదు. మరోవైపు వరుస ఓటముల నేపథ్యంలో అన్నా డీఎంకేలో పళనిస్వామి నాయకత్వం బలహీనపడింది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కొత్తగా ఆవిర్భించిన విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు దక్కించుకోగా డీఎంకే 59 స్థానాలకు పరిమితమైంది. అయితే అన్నాడీఎంకే 47 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. తాజా పరిణామాల ప్రకారం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే భవిష్యత్తు అత్యంత కీలకమైన, అనిశ్చిత మలుపులో ఉంది. జయలలిత మరణం తర్వాత బలమైన నాయకత్వం లేకపోవడం, అంతర్గత విభేదాలు, మరియు కొత్త శక్తుల ఉధృతి పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బీజేపీ చొరవ తీసుకున్నా పెద్దగా ఫలించలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నేతగా ఉన్న ఎస్పీ షణ్ముగం నాయకత్వంలో తిరుగుబాటు రావడంతో పార్టీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కాగా బలమైన నాయకత్వం లేకపోయినా, అన్నాడీఎంకేకు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో మంచి కేడర్, ఓటు బ్యాంకు ఉంది. ఇది ఆ పార్టీని పూర్తిగా కనుమరుగు కాకుండా కాపాడుతోంది.




