Off The Record: సూర్యాపేట కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట! రేవంత్ సర్జరీ తప్పదా?

Off The Record: సూర్యాపేట కాంగ్రెస్‌లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత తీవ్ర నాయకత్వ సంక్షోభం నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Jun 2026 7:02 AM IST
Off The Record
X

Off The Record: సూర్యాపేట కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట! రేవంత్ సర్జరీ తప్పదా?

Off The Record: సూర్యాపేట కాంగ్రెస్‌కు ఇన్నాళ్లూ పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత.. నియోజకవర్గంలో లీడర్‌షిప్ కోసం అసలైన ఫైట్ మొదలైంది. దామోదర్ రెడ్డి మరణించి కొన్ని నెలలు కూడా గడవకముందే.. కాంగ్రెస్ ఇక్కడ మూడు ముక్కలాటగా మారిపోయింది. ఒకవైపు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మరోవైపు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, ఇంకోవైపు టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.

జిల్లా కేంద్రంలో ఓ పెళ్లి వేడుకకు వచ్చిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ ముగ్గురు నేతలు వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరుగా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేయడం చూసి జనాలే ముక్కున వేలేసుకున్నారు. టేకుమట్ల దగ్గర ఒకరు, చీకటిగూడెం దగ్గర మరొకరు, పిల్లలమర్రి స్టేజ్ వద్ద ఇంకొకరు.. ఇలా రూట్ మ్యాప్‌లు మార్చి మరీ శ్రేణులతో స్వాగతాలు పలకడం.. పార్టీలో ఉన్న విభేదాలను 70 ఎంఎం స్క్రీన్‌పై చూపించినట్లు బహిర్గతం చేసింది. మంత్రినే కన్ఫ్యూజ్ చేసేలా చేసిన ఈ స్వాగత సత్కారాలు, అంతర్గత పోరుకు నిదర్శనంగా నిలిచాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న ద్వితీయశ్రేణి లీడర్లు, కార్యకర్తలు..ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమ పనులు అవుతాయని ఆశపడ్డారు. కానీ పేటలో సీన్ చూస్తుంటే..నాయకుల గొడవలతో కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందట. ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే.. ఏ వర్గంలో ఉండాలో తెలియక కేడర్ సతమతమవుతోందట.. ఒకరితో కనిపిస్తే.. ఇంకొకరి నుంచి బెదిరింపులు వస్తున్నాయట. "మా వైపు రాకపోతే మీ పని అవ్వదు" అంటూ లోకల్ లీడర్లు హుకుం జారీ చేస్తుండటంతో.. సామాన్య కార్యకర్త దిక్కుతోచని స్థితిలో పడిపోయారట.

నేతల మధ్య ఉన్న ఈ గ్యాప్‌ను స్థానిక అధికారులు భలేగా వాడుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లో ఏదైనా పని మీద కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తే.. అధికారులు కనీసం కేర్ చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ముగ్గురు నేతలు మూడు రకాలుగా సిఫార్సులు చేస్తుండటంతో.. "ముందు మీలో మీరు తేల్చుకోండి, ఆ తర్వాత మేం పని చేస్తాం" అంటూ అధికారులు బాహాటంగానే ఎద్దేవా చేస్తున్నారట. దీనివల్ల పదేళ్లు కష్టపడ్డ కాంగ్రెస్ శ్రేణులకు సొంత ప్రభుత్వంలోనే అవమానాలు ఎదురవుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేడర్ కోరుతోంది. ఆయన వచ్చి పంచాయితీ తెంచకపోతే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. మరోవైపు, ఈ ‘త్రివర్గ పోరు’పై రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ప్రత్యేక కన్నేశాయట. ఇక్కడి లీడర్ల గ్రూపు పాలిటిక్స్, అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి.. సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెడుతున్నట్లు సమాచారం. అధిష్టానం ఇప్పటికే ఈ గ్రూపు రాజకీయాలపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

సూర్యాపేటలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ నుంచి బలమైన లీడర్‌గా జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తే.. ఒక్క సూర్యాపేటలో మాత్రం గులాబీ జెండాను ఎగరేశారు జగదీశ్వర్‌రెడ్డి. గత రెండు మూడు టర్మ్‌ల నుంచి అక్కడ ఆయనే గెలుస్తూ వస్తున్నారు. మరి అలాంటి చోట బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైన ఉంటేనే సాధ్యం. కానీ సూర్యాపేట కాంగ్రెస్‌లో మాత్రం ట్రై సిరీస్ నడుస్తోంది.

ఆధిపత్య పోరుతో..పార్టీలో మూడు ముక్కలాట కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తామే బలమైన నేతగా నిలిచి టికెట్ దక్కించుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారట. నియోజకవర్గంలో తమ బలాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే మంత్రులు, ముఖ్యనేతల వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నంచేస్తున్నారు. దీంతో నేతల్లాగే.. కేడర్ సైతం మూడు వర్గాలుగా చీలిపోతుందన్న టాక్ వుంది. హస్తంలో వర్గ పాలిటిక్స్‌.. ఇలాగే కొనసాగితే పేటలో మళ్లీ ప్రతిపక్షానికి ప్లస్ అయ్యే సూచనలు లేకపోలేదన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి.

"మరి 'బాస్' రేవంత్ రెడ్డి సూర్యాపేట కాంగ్రెస్ కు ఎలాంటి సర్జరీ చేస్తారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురిని ఎలా లైన్ లో పెడతారు? కార్యకర్తల ఆవేదనను అధిష్టానం గుర్తిస్తుందా? లేదా ముగ్గురి పోరులో పార్టీ పరువు గంగలో కలుస్తుందా? వేచి చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story