Burning Topic: పంచదార దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం!

Burning Topic: పండుగల సీజన్‌లో చక్కెర ధరలు కిలో రూ. 70 వరకు పెరిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ 10 లక్షల టన్నుల దిగుమతులకు అనుమతించడంతో పాటు నిల్వలపై పరిమితులు విధించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Aug 2026 7:22 AM IST
Burning Topic
X

Burning Topic: పంచదార దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం!

Burning Topic: భారతీయులు సహజంగానే తీపిని ఇష్టపడతారు. ప్రపంచంలో అత్యధికంగా పంచదారను వినియోగించే దేశాల్లో మనదే అగ్రస్థానం.మన దేశంలో ఏటా 32 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగం జరుగుతోంది. మన రోజువారీ జీవితంలో టీ, కాఫీలతో పాటు స్వీట్లు, పండుగలు శుభకార్యాలలో పంచదారను విరివిగా ఉపయోగిస్తాం. ప్రస్తుతం మన దేశంలో పండుగల సీజన్ మొదలైంది. వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, ఓనం, కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి, ఛత్ పూజ వరుసగా వస్తాయి. ఇలాంటి సమయంలో ధరలు పంచదార రికార్డు స్థాయికి చేరుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు వారాల వ్యవధిలో కిలో చక్కెర ధర రూ.20 దాకా పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో పంచదార ధర రూ.65నుంచి రూ.70 దాకా పలుకుతోంది. అసలు ఒక్కసారిగా ఇంతలా చక్కెర రేటుకు కారణం ఏంటనే ప్రశ్న మొదలైంది.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ20 కార్యక్రమం చక్కెర కొరతకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్ కోసం లక్షలాది టన్నుల చెరకును మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది సుమారు 30 లక్షల టన్నుల చెరుకును ఇథనాల్ ఉత్పత్తి కోసం ఉపయోగించారు. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం చేరుకుందని ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ చెబుతోంది. అయితే ఇథనాల్ తయారీ కోసం చెరకు ఎక్కువగా మళ్లించడం వల్లే చక్కెర ధరలు పెరిగాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025-26 మార్కెటింగ్‌ సంవత్సరం అక్టోబరు-సెప్టెంబరులో ఇథనాల్‌ ఉత్పత్తికి కేటాయించాక కూడా, దేశీయంగా నికరంగా పంచదార ఉత్పత్తి 279 లక్షల టన్నులు ఉందని చెబుతున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడొంతులు ధాన్యాల నుంచే వస్తుందని, కాబట్టి చక్కెర కొరతకు ఇథనాల్ కారణం కాదని స్పష్టం చేశారు.

2025 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అధిక వర్షపాతం ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లోని చెరకు పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌లలో ప్రాథమిక చక్కెర ఉత్పత్తి అంచనాలకన్నా తక్కువగా నమోదైంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో ఎర్ర కుళ్లు తెగులు, కాండం తొలిచే పురుగుల వ్యాప్తి గణనీయంగా పెరిగింది. దీనికి తోడు 2026 జూన్‌లో మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షపాతం లోటు, రాబోయే చెరకు పంటపై ఆందోళనలను పెంచింది. చెరుకు ఉత్పత్తి తగ్గడాన్ని గమనించి కొన్ని మిల్లులు తమ నెలవారీ ప్రభుత్వ నిర్దేశిత కోటాలకు మించి చక్కెరను విక్రయించినట్లు సమాచారం. ధరల పెరుగుదలను ఊహించి వ్యాపారులు, స్టాకిస్టులు, బల్క్ వినియోగదారులు చక్కెరను నిల్వ చేయగా, పండుగ సీజన్‌లో ధరలు పెరుగుతాయని భావించి కొన్ని మిల్లులు అమ్మకాలను నిలిపివేశాయి. ఇవన్నీ చక్కెర ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

దేశీయంగా పంచదారకు వార్షిక గిరాకీ 280-285 లక్షల టన్నులుగా ఉంది. కాగా 2025-26 సీజన్ ఆరంభంలో చక్కెర ఉత్పత్తి సమృద్ధిగా ఉందనే అంచనాతో ప్రభుత్వం సుమారు 8 లక్షల టన్నుల ఎగుమతులకు అనుమతి ఇవ్వడం దేశీయ నిల్వలను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. కాగా మార్కెట్లో చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టారిఫ్‌ రేట్‌ కోటా విధానంలో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ముడి చక్కెర దిగుమతి విధానాన్ని సవరించింది. ఓపెన్ మార్కెట్‌లో మరింత చక్కెర అందుబాటులో ఉండేలా సాఫ్ట్ డ్రింక్, ఐస్‌క్రీమ్ తయారీదారుల వంటి డీలర్లు, బల్క్ కన్స్యూమర్లకు స్టాక్-హోల్డింగ్ పరిమితులను కూడా కఠినతరం చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ చర్యలతో ధరలు దిగివస్తాయని చక్కెర తయారీదారుల సమాఖ్య ఇస్మా ప్రకటించింది.

కాగా దేశీయంగా తగినంత మేర చక్కెర నిల్వలు ఉన్నప్పటికీ, పరిశ్రమ వర్గాలే కృత్రిమ కొరత సృష్టించి, ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పండగల సీజన్ ముందు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో కొందరు వ్యాపారులు నిల్వల్ని పెంచుకోవడంతో మార్కెట్‌లో కొనత ఏర్పడుతోందని పేర్కొంది. 2025-26 మార్కెట్ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి 306 లక్షల టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. దేశీయ డిమాండ్ దాదాపు 290లక్షల టన్నులు ఉందన్నారు. దేశీయ అవసరాలకు మించి చక్కెర ఉత్పత్తి జరుగుతోందని వ్యాపార రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే చెరుకు పండించే రాష్ట్రాల్లో పంటకు చీడపీడలు, విపరీతమైన వర్షాలతో నీరు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి, మునుపటి అంచనా 343లక్షల టన్నుల నుంచి తగ్గింది.

పండుగల ఆరంభంలో చక్కెర ధరలు ఇంతలా పెరగటంతో చిన్నవ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా పాత ధరలకే విక్రయించడం వల్ల తాము నష్టపోతున్నామని చిన్న వ్యాపారులు అంటున్నారు. మిఠాయిలు తప్పనిసరి కావటంతో చక్కెరకు డిమాండ్ పెరిగి వాటి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం పలుచర్యలు చేపట్టినప్పటికీ, ఇప్పటికిప్పుడు చక్కెరధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు అంటున్నాయి. కాగా పండుగ డిమాండ్ కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చక్కెర ధరలు ఆకాశాన్నంటడంతో ఈ ఏడాది పండుగ సీజన్ చేదు అనుభవాన్ని మిగుల్చుతుందనే ప్రజలు ఆందోళనల వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు నిరంతరంగా పెరుగుతుండటం కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story