Off The Record: సింగరేణి ఎన్నికలపై అనిశ్చితి!
Off The Record: సింగరేణి గుర్తింపు సంఘం AITUC పదవీకాలం ముగియడంతో తెరపైకి కొత్త ఎన్నికల వివాదం. గడువు పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్ష కార్మిక సంఘాలు.
Off The Record: సింగరేణి ఎన్నికలపై అనిశ్చితి!
Off The Record: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు సంఘం ఎన్నికల విషయమై ప్రస్తుతం యాజమాన్యం, వివిధ కార్మిక సంఘాల మధ్య గుర్తింపు వార్ నడుస్తోంది. కొత్త ఎన్నికల నిర్వహణకు సంబంధించి సింగరేణి యాజమాన్యం కానీ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కానీ ఇంకా ఎలాంటి అధికారిక షెడ్యూల్ ప్రకటించలేదు.
నిజానికి 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల అధికారిక రెండేళ్ల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 9తో ముగిసింది. అయితే, తాము ఎన్నికల సర్టిఫికెట్‌ను ఆలస్యంగా తీసుకున్నామని, కాబట్టి తమ పదవీకాలం 4 ఏళ్లు ఉండాలని గుర్తింపు సంఘం AITUC వాదిస్తోంది. దీనిపై యాజమాన్యం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
అయితే ప్రస్తుత గుర్తింపు సంఘం గడువు పొడిగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. బీఆర్‌ఎస్ అనుబంధ TBGKS, బీజేపీ అనుబంధ బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ వంటి ప్రతిపక్ష సంఘాలు ఎన్నికల కాలపరిమితి కేవలం రెండేళ్లేనని స్పష్టం చేస్తున్నాయి.
వెంటనే కొత్త ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గడువు పొడిగింపును సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశాయి. ఒకవేళ ఎన్నికల నిర్వహణ ఆలస్యమైతే, కొత్త ఎన్నికలు జరిగే వరకు సింగరేణిలో నమోదైన అన్ని కార్మిక సంఘాలకు యాజమాన్య చర్చల్లో సమాన హోదా కల్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణిలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలినాళ్లలో ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరిగేవి. 2003లో తొలిసారిగా గుర్తింపు సంఘం కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచారు. 2017 వరకు ఇదే విధానం కొనసాగింది. అయితే.. 2017 అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాలపరిమితిని తిరిగి రెండేళ్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ కాలపరిమితి ముగియడంతో.. మరో రెండేళ్లు పొడిగించాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం కోర్టు పిటిషన్లు, కార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో ఎన్నికల వేడి తీవ్రంగా పెరిగింది.. సింగరేణిలోని ప్రధాన కార్మిక సంఘాలు మాత్రం ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, టీజీబీకేఎస్, సీఐటీయూ, బీఎంఎస్ సంఘాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి.
ఎన్నికలు జరిగితే గత పట్టు నిలుపుకోవాలని టీజీబీకేఎస్ ప్రయత్నిస్తుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్‌టీయూసీ కూడా సింగరేణిపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కూడా తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
అయితే టీజీబీకేఎస్ గతంలో ఆరేళ్లు, మరోసారి నాలుగేళ్లు గుర్తింపు సంఘంగా కొనసాగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎన్నికల కోసం ఆ సంఘం చేస్తున్న డిమాండ్‌పై ఏఐటీయూసీ నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరుగుతాయా..? లేక కాలపరిమితి పొడిగింపే జరుగుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.




