Off The Record: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు ?
Off The Record: కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిపై అధిష్ఠానం వేటు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగింపు. గోపాల్‌పేట వ్యాఖ్యల వివాదం, పూర్తి వివరాలు.
Off The Record: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు ?
Off The Record: దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతున్నారు సీనియర్ నేత చిన్నారెడ్డి. 1978లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. పార్టీ బలోపేతానికి పనిచేస్తూ అనేక పదవులు చేపట్టారు. అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాంటి నేతపై ఇప్పుడు పార్టీ అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోవడం ఉమ్మడి మహబూబ్‌నగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు వివాదానికి కారణం గోపాల్‌పేటలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి.
ముఖ్యంగా ఎమ్మెల్యే బీ.ఫారాలను పార్టీ, నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి పట్టుబట్టారు. వివాదం అక్కడితో ఆగలేదు.
ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ వ్యవహారాన్ని టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. డిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో చిన్నారెడ్డి వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై నివేదికను అధిష్ఠానానికి అందించింది.
క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. గోపాల్‌పేటలో నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వారి మనోభావాలను మాత్రమే వ్యక్తం చేశానని వివరణ ఇచ్చారు.
ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే చిన్నారెడ్డి వివరణతో అధిష్ఠానం వెనక్కి తగ్గలేదు. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదనే నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం.. చివరకు ఆయనను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించింది.
ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖపైనా అధిష్ఠానం చర్యలు తీసుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దాదాపు 48 ఏళ్లుగా కాంగ్రెస్‌తో ప్రయాణం సాగించిన చిన్నారెడ్డికి ఈ పరిణామం చేదు అనుభవంగా మారింది. పదవి కోల్పోవడంతో ఆయన అనుచరుల్లో నిరాశ నెలకొంది.
గురువారం అధిష్ఠానం నిర్ణయం వెలువడిన తర్వాత.. చిన్నారెడ్డి తన సొంతూరు గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపూర్‌లోని పొలాల వద్ద ఎక్కువ సమయం గడిపినట్లు సమాచారం. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ కాంగ్రెస్‌లో ప్రధాన చర్చ ఇదే.
పదవులపై తనకు ఎలాంటి వ్యామోహం లేదని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. తన కేడర్‌కు వెన్నంటే ఉంటానని ప్రకటించారు. అయితే తన సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పదవి పోయింది.. కానీ రాజకీయ ప్రస్థానం ఆగుతుందా..? చిన్నారెడ్డి మాత్రం ప్రస్తుతానికి తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా...? పార్టీపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తారా...? లేక భవిష్యత్ రాజకీయాలకు కొత్త వ్యూహాన్ని రూపొందిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధం తర్వాత చిన్నారెడ్డి తీసుకునే నిర్ణయం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మరి చూడాలి గోపాల్ పేటలో చేసిన కామెంట్స్‌తో పదవిని కోల్పోయిన చిన్నారెడ్డి.. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో...?




