Off The Record: కమలంలో భగ్గుమంటున్న విభేదాలు.. ఫిర్యాదుల కలకలం
Off The Record: తెలంగాణ బీజేపీలో ముదిరిన విభేదాలు. ప్రధాని మోదీకి రాష్ట్ర నేతల రహస్య లేఖ? ఒక కేంద్ర మంత్రి, ఒక సీనియర్ ఎంపీ లక్ష్యంగా ఫిర్యాదులు.
Off The Record: కమలంలో భగ్గుమంటున్న విభేదాలు.. ఫిర్యాదుల కలకలం
Off The Record: ఒక లేఖ. తెలంగాణ బీజేపీలో పొలిటికల్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే పార్టీలో కొత్త-పాత వర్గపోరు సాగుతుండగా ఈ లేఖ మరింత ఆజ్యం పోసేలా ఉందట. నేరుగా ప్రధాని మోడీకే లేఖ రాయడం..…కమల దళంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపిందట..? పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కేంద్ర మంత్రి, ఓ సీనియర్ ఎంపీపై ఫిర్యాదులు చేయడం దేనికి సంకేతం..? అసలు ఆ లేఖలో ఏముంది? ఇంతకీ ఆ లేఖ వెనుక అసలు ఎవరున్నారు..? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సంతకాలు చేశారనే ప్రచారం ఎంతవరకు నిజం..? పార్టీ వ్యవహారాలు ఆ ఇద్దరీ చేతుల్లోనే బందీ అవుతున్నాయా..? లేక ఎన్నికల ముందు అసంతృప్తి గళం వినిపిస్తున్నారా..? పూర్తి విశ్లేషణ వాచ్ దిస్ ఓటీఆర్.
తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా అంతర్గత విభేదాలు సర్వసాధారణంగా మారిపోయినట్టైంది. రోజుకో పంచాయితీ బయటపడుతూ పార్టీలో రచ్చలేపుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ నేతలు.. పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు రోజుకో నేత విచిత్ర కామెంట్స్ చేస్తుండటం.. అదినాయకత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతుంది. అంతర్గత వివాదాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అనే నానుడి ఉండేది. వారికంటే మేమేమీ తక్కువ కాదన్నట్టు తెలంగాణ బీజేపీ నేతలు అంతర్గత వివాదాలు, కొత్త, పాత అంటూ భేదాభిప్రాయాలు, అనవసర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారనే చర్చ లేకపోలేదు. తాజాగా..పార్టీలోని ఓ కేంద్రమంత్రి, ఓ సీనియర్ ఎంపీల పెత్తనం పార్టీలో ఎక్కువైందని ఫిర్యాదు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ పంపడం పొలిటికల్ బాంబ్ పేలినట్టైంది. సొంత పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై రాసిన లేఖ వెనుక ఎవరున్నారు? ఆ లేఖలో సంతకాలు చేసిన వారెవరు ? ఇకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు లేఖ రాయడానికి గల కారణాలేంటీ? వారి ఉద్దేశమేంటీ? అన్న దానిపై ప్రధానంగా చర్చనీయాంశమైంది.
నేరుగా ప్రధాని మోదీ వద్దకు లేఖ చేరడం ఇప్పుడు రాష్ట్ర పార్టీలో పెద్ద దుమారమే రేగింది. అసలు ఎంపీలు,ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ ఇద్దరు నేతల తీరుపై లేఖ రాసేంతా అసంతృప్తి వెనుక ఉన్న మతలబేంటి అనే చర్చ లేకపోలేదు..ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు అంటూ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. లేఖలోని అంశాలను పరిశీలిస్తే.. ఒకరేమో కేంద్రమంత్రి, మరొకరేమో ఎంపీ. ఈ ఇద్దరు కీలక నేతలపై తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. పార్టీ కార్యక్రమాలు సరైన దిశలో సాగడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదని, పార్టీ ఓటమికి ప్రధాన కారకులంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా GHMC ఎన్నికల వేళ స్థానిక ఎంపీలకు అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై పూర్తి స్వేచ్ఛ కోరడం, అలాగే పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం ఆ ఇద్దరి నేతల కన్నుసన్నల్లో జరిగే విధంగా పరిస్థితులు దాపురించడం సరికాదంటూ లేఖలో మెన్షన్ చేయడం సంచలనంగా మారిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే కొత్త- పాత నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న ప్రచార నేపథ్యంలో ఈ లేఖ పార్టీ బలోపేతంపై ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు..తమ విజయం పార్టీ కంటే వ్యక్తిగత కృషి వల్లనే సాధ్యమైందని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆ ఇద్దరు నేతల తీరు కారణంగానే పార్టీ బలోపేతం కావడం లేదని, ఆ ఇద్దరు నేతల తీరు ఇలాగే కొనసాగితే పార్టీలో ఉండాలా? లేదా? అని కరాఖండిగా ఆ లేఖలో సంతకాలు చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టే వాతావరణం, అట్లాంటి పరిస్థితులు తెచ్చే ప్రయత్నంలో విఫలమయ్యారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఆ ఇద్దరు నేతల తీరులో మార్పు కోరుకుంటున్నామని, తీరు మారకుండా ప్రతి దాంట్లో వారి పెత్తనం ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గడ్డు పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.. ఈ లేఖపై ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్థోంది..
పార్టీకి చెందిన 4 నుంచి 6 గురు ఎమ్మెల్యేలు, 5నుంచి 6గురు ఎంపీలులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కొందరు అత్యంత సీనియర్ నేతలు సైతం సంతకాలు చేసి మోదీకి రహస్య లేఖను పంపించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో అంతర్గత కొట్లాటలకు మరింతా బలం చేకూరినట్టైంది. మరోవైపు ఆ లేఖ వ్యవహారంపై కొందరు పార్టీ నేతలు స్పందిస్తూ… ఇది సాధారణ కమ్యూనికేషన్ మాత్రమేనని చెబుతుండటం గమనార్హం...ఈ లేఖపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఏ ఇద్దరు నేతలు కలిసినా గుసగుసలాడుతూ చెవులు కొరుక్కునేలా మాట్లాడుకుంటున్నారట. అసలు ఆ కేంద్రమంత్రి ఎవరు? , ఆ సీనియర్ ఎంపీ ఎవరై ఉంటారని, మరోవైపు అసలు ఆ లేఖలో సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరంటూ పార్టీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. ఇదంతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదనే చర్చ సైతం నడుస్థోందటా.. బీజేపీలో పొలిటికల్ లేఖ ఒక బాంబ్ లాగా మారిపోయి ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు..
గతంలో ఇలాంటి లేఖలు ఎన్నో రాశారని, ఈ లేఖ ద్వారా ఎలాంటి మార్పు ఉండదని, కనీసం పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టినట్లు కొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు.. లేఖ అంశంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం పొంతనలేని తలో మాటతో సమాధానాలు ఇస్తుండటం ఆశ్చర్యకరంగా మారిన తరుణంలో.. నిజంగానే లేఖ రాశారా ? అన్న మీడియా ప్రశ్నకు ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం లేఖ రాసింది నిజమేనంటూ ఒప్పుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. లేఖ రాస్తే తప్పేముంది.. ముఖ్యంగా సీఎస్‌ఆర్ నిధులు, అభిప్రాయాలు, సూచనల కోసం ప్రధానికి లేఖ రాయడం సహజమని ఈటెల అనడంతో లేఖాస్త్రానికి మరింత బలం చేకూరినట్టైంది. పార్టీలో అందరూ కలిసి పనిచేస్తున్నామని… ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇస్తూనే.. లోలోపల నేతలు మదనపడుతున్నప్పటికీ.. బయటకు ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ నేతలెవరు బహిరంగంగా లేఖపై క్లారిటీ ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ లేఖ రాసింది నిజమైతే మరీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అలాగే రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి నివేదిక కోరుతుందోననే ఉత్కంఠ సైతం పార్టీ నేతల్లో ఉత్పన్నమవుతుందటా..
మొత్తానికి… ఈ లేఖ తెలంగాణ బీజేపీలో దాగి ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టిందా..? లేదా… గ్రేటర్, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల ముందు వ్యూహాత్మక రాజకీయమా..? ఈ లేఖతో మొదలైన అసంతృప్తి జ్వాలలు... రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందా..? లేఖలో పేర్కొన్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రధాన డిమాండ్లకు అధిష్టానం తలొగ్గి ఆ ఇద్దరు నేతల తీరులో మార్పు తెప్పిస్తుందా ? లేదా లైట్ తీసుకుంటుందా ? ఇకా ఎంపీలు కోరినట్లు వారి నియోజకవర్గాల్లో పూర్తి స్వేచ్ఛ ఇస్తోందో?లేదో ? అన్నది చూడాలి మరి.


